పైరసీ… ఎన్నో ఏళ్లుగా సినిమా పరిశ్రమను ఇబ్బంది పెడుతున్న రోగం. చాలాసార్లు, చాలామంది ప్రయత్నాలు చేసినా చిక్కినట్లే చిక్కి వేళ్లు సందుల నుండి జారిపోతోంది. దీంతో పైరసీ దెబ్బకు చాలా సినిమాలు ఆవిరైపోయాయి అనొచ్చు. ఈ మాట వినడానికి అతిశయోక్తిగా ఉండొచ్చు కానీ… సినిమా వాళ్లకు పైరసీ కష్టం గురించి తెలిసినవాళ్లు నిజమే అని అంటారు. అయితే ఈ విషయంలో పదునైన చట్టాలు ఉండాలి అని చాలా రోజులుగా మాటలు వినిపిస్తున్నా.. ఎట్టకేలకు సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలు చేశారు.
సినిమా పైరసీ చేసేవారికి మూడేళ్ల జైలు శిక్ష విధించేలా సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు -2023ను తీసుకొచ్చారు. దాంతోపాటు తోపాటు ఆ సినిమా నిర్మాణ వ్యయంలో 5 శాతం జరిమానాగా విధిస్తారు. ఈ మేరకు రూపొందించిన సవరణలను సోమవారం లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లును ఇప్పటికే రాజ్యసభ ఆమోదించింది. ఇక ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశాక చట్టంగా మారనుంది. త్వరలోనే ఈ ఆమోద ముద్ర పడుతుందని సమాచారం. ఇక పైరసీ కారణంగా సినిమా పరిశ్రమ ఏటా రూ.20 వేల కోట్లు నష్టపోతోందని అంచనా.
ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ లోక్‌సభలో వెల్లడించారు. పైరసీ అనేది క్యాన్సర్ లాంటిదని, దానిని పూర్తిగా నిర్మూలించడానికే ఈ సినిమాటోగ్రీఫీ బిల్లు తీసుకొచ్చామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా మాట్లాడారు. పైరసీని అరికట్టడానికి కఠినమైన కొత్త సెక్షన్లను బిల్లును పెట్టామని కూడా తెలిపారు. దీంతో సినిమాల వర్గీకరణ విషయంలోనూ మార్పులు చేశారు. సినిమా, టీవీ కంటెంట్‌ను ఇకపై వయసుల వారీగా వర్గీకరించనున్నారు. UA కేటగిరీని UA 7 ప్లస్, UA 13 ప్లస్, UA 16 ప్లస్‌గా విభజించారు. ఆ మేరకు సినిమాలు, సిరీస్‌లు, టీవీ కంటెంట్‌కు సెన్సార్ సర్టిపికెట్ ఇస్తారు.
టీవీలో సినిమా ప్రదర్శించడానికి త్వరలో ప్రత్యేకంగా సర్టిఫికెట్ ఇస్తారు. దీంతోపాటు సెన్సార్ సర్టిఫికెట్ కాలపరిమితిని కూడా పెంచారు. పాత చట్టం ప్రకారం సెన్సార్ సర్టిఫికెట్ 10 ఏళ్ల వరకే చెల్లుబాటు అయ్యేది. కొత్త చట్టం వచ్చాక సెన్సార్ సర్టిఫికెట్ లైఫ్‌టైమ్ ఉంటుంది. A సర్టిఫికెట్ వచ్చిన సినిమాలో మార్పులు చేస్తే UA సర్టిఫికెట్ ఇచ్చే అవకాశం కొత్త బిల్లులో ఉంటుంది.