‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత మెగా స్టార్ చిరంజీవి నుండి రాబోతున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ వంటివి సినిమా పై భారీ అంచనాలు నమోదయ్యేలా చేసాయి. చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
‘కొణిదెల ప్రొడక్షన్స్’, ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ల పై రాంచరణ్, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 29న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లను వేగవంతం చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. ఇందులో భాగంగా ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ వేడుకని ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 23న ‘ఆచార్య” ప్రీ రిలీజ్ వేడుక జరుగుతుంది.
ఇంకో విశేషం ఏంటంటే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతున్నారు అని తెలుస్తుంది !. విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీ.ఎం.జగన్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
టికెట్ రేట్ల ఇష్యుని పరిష్కరించే క్రమంలో సీఎం జగన్‌తో చిరంజీవికి మంచి సాన్నిహిత్యం కుదిరింది.పైగా ‘ఆచార్య’ నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు జగన్ కు దూరపు చుట్టాలని వినికిడి.అందుకే ఏపి ముఖ్యమంత్రి జగన్ ఈ వేడుకకి హాజరుకావడానికి ఒప్పుకున్నట్టు సమాచారం.