చిరంజీవి (Chiranjeevi) సినిమాల ఆర్డర్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే తన 150వ సినిమాగా ‘ఖైదీ నెం 150’ను అనౌన్స్ చేశారు. అయితే 150వ సినిమా అవ్వదు.. లెక్కలు తప్పేశారు అని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ తర్వాత అవన్నీ వదిలేయండి.. ఇక్కడి నుండే కంటిన్యూ చేద్దాం అని అనుకున్నారంతా. అనుకున్నట్లుగానే చేస్తున్నారు కూడా. అయితే 157 నెంబరు వచ్చినప్పటి నుండి ఏదో సమస్య మొదలైంది. ఎందుకంటే ఈ నెంబరులో అనుకున్న సినిమాలు, ప్రాజెక్టులు ఇబ్బంది పడుతున్నాయి.
అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చిరంజీవి నటించబోతున్న సినిమాకు తాజాగా 157 నెంబరు కేటాయించారు. దీంతో మరోసారి 157 నెంబరు గురించి చర్చ మొదలైంది. దీంతో చిరంజీవి లైనప్, అందులో ఆ నెంబరు సినిమా ఏంటి అని చూసే ప్రయత్నం చేస్తే.. ఆసక్తికర అంశాలు కొన్ని బయటికొచ్చాయి. లెక్కల ప్రకారం చూస్తే డిజాస్టర్ ‘భోళా శంకర్’ (Bhola Shankar) చిరంజీవికి 155వ సినిమా. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే చిరంజీవి వరుస సినిమాలు అనౌన్స్ చేశారు. అలా కల్యాణ్ కృష్ణ సినిమా 156వ సినిమా అయింది.
ఆ వెంటనే వెంకీ కుడుముల (Venky Kudumula) – డీవీవీ దానయ్య సినిమాను అనౌన్స్ చేశారు. ఆ సినిమాకు అప్పట్లో 157 నెంబరు ఇచ్చారు. కానీ వివిధ కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆలోచన ముందుకెళ్లలేదు. ఈ లోపు ‘బింబిసార’ (Bimbisara) వశిష్ట (Mallidi Vasishta) వచ్చారు. ఆయన చెప్పిన ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా కథ ఓకే అవ్వడంతో దానికి ఆ 157 నెంబరు ఇచ్చేశారు. సినిమా ప్రారంభం అనగానే దానికి 156 నెంబరు ఇచ్చేశారు. దానికి కారనం కల్యాణ్ కృష్ణ సినిమా ఆలోచన ఆగిపోవడమే.
దాంతో 157 నెంబరు ఖాళీ అయిపోయింది. ఈ ప్లేస్‌లోకి రావడానికి చాలా ప్రాజెక్ట్‌లు, చాలామంది దర్శకులు ముందుకొచ్చారు. వారిలో హరీశ్ శంకర్ (Harish Shankar), పూరి జగన్నాథ్ (Puri Jagannadh), వీవీ వినాయక్ (V. V. Vinayak), మోహన్ రాజా (Mohan Raja) ఉన్నారు. వాళ్లెవరికీ ఆ ఛాన్స్ రాలేదు. ఈ లోపు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) సినిమా అనౌన్స్ చేశారు. దానికి ఆ నెంబరు ఇచ్చేశారేమో అనుకున్నారంతా. అయితే అది 158 అని, అనిల్ రావిపూడి సినిమా 157 అని తేలింది. ఇలా ఇన్ని మార్పులకు లోనై ఆ సినిమా ఆదివారం స్టార్టయింది.
ఇక్కడో విషయం ఏంటంటే.. కొన్ని రోజులు 157 నెంబరు పెట్టుకున్న ‘విశ్వంభర’ నానా ఇబ్బందులు పడుతూ ఇంకా రిలీజ్ డేట్ విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. అంటే 157 విషయంలో ఏదో ఇబ్బంది ఉంది అని చెప్పొచ్చు.