‘సినిమా గ్లింప్స్ వచ్చాక ఒక్క ‘షాట్’ కోసం వెయ్యిసార్లు చూస్తారు!’.. అంటూ ఆ సినిమా నిర్మాత కాన్ఫిడెంట్‌గా చెప్పారు అంటే.. ఆ వీడియోలో ఏదో స్పెషల్ ఉంది అని అనుకున్నారు అంతా. అనుకున్నట్లుగానే ఆ సినిమా గ్లింప్స్.. టైటిల్ కమ్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వీడియోగా రిలీజ్ చేశారు. అందులో క్లయిమాక్స్‌కి వచ్చేవరకు ఆ వీడియో స్పెషాలిటీ అర్థం కాలేదు. ఆ షాట్ పూర్తయ్యాక ఆటోమేటిక్‌గా వేళ్లు మొబైల్ స్క్రీన్ మీద ఎడమవైపు డబుల్ ట్యాప్ అయ్యేవి. సిస్టమ్‌లో చూస్తుంటే ఎడమ కర్సర్ బటన్ క్లిక్ అయిపోయింది.
ఇదంతా ‘పెద్ది’ (Peddi) సినిమా గ్లింప్స్ గురించే అని మీకు తెలిసే ఉంటుంది. రామ్‌చరణ్ (Ram Charan) – బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. ఆ గ్లింప్స్ ఆఖరులో స్టెప్ ఔట్ అయి భారీ సిక్సర్ కొడతాడు రామ్‌చరణ్. నిజ జీవితంలో క్రికెట్‌లో అలాంటి షాట్ ఆడటం దాదాపు అసాధ్యం. కానీ సినిమాటిక్‌గా చూడటానికి బాగుంది. అందుకే జనాలు అంతలా ఆ సీన్ చూస్తున్నారు. ‘పెద్ది షాట్’ అంటూ ఫేమస్ అయిపోయింది కూడా. ఈ సీన్ వెనుక ఉన్నదెవరు, ఆ క్రెడిట్ ఎవరికి దక్కుతుందో చెప్పేశారు బుచ్చిబాబు సానా.
‘పెద్ది’ షాట్ ఆలోచన వెనుక ఉన్నది ఫైట్ మాస్టర్ నవకాంత్. పెద్ది షాట్‌ను డిజైన్ చేశారని, అతడికే క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నానని బుచ్చిబాబు తెలిపారు. అంతేకాదు ‘పెద్ది’ గ్లింప్స్ రిలీజ్ రోజు తాను రామ్ చరణ్ ఇంట్లోనే ఉన్నానని చెప్పారు. వీడియో చిరంజీవికి (Chiranjeevi) నచ్చుతుందా, లేదా? అని టెన్షన్ పడ్డానని కూడా తెలిపారు. ఆయన వీడియో చూశాక బాగుందని చెప్పారు. అది ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం అని బుచ్చిబాబు సానా పేర్కొన్నారు.
కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఫిక్షనల్ కథతో ‘పెద్ది’ సినిమా తెరకెక్కిస్తున్నట్టు బుచ్చిబాబు తెలిపారు. కొవిడ్ – లాక్‌డౌణ్ టైమ్‌లోనే ‘పెద్ది’ సినిమా ఆలోచన వచ్చిందని, స్క్రిప్టు పూర్తయిన తర్వాత సుకుమార్‌కు వినిపించానని, ఆయన బాగుందని చెప్పి రామ్‌చరణ్‌ను కలసి స్టోరీ చెప్పమన్నారని బుచ్చిబాబు తెలిపారు. సినిమా కాన్సెప్టు, హీరో పాత్ర చిత్రణ ఆయనకు బాగా నచ్చాయని, కొన్ని చిన్న కరెక్షన్స్ చెప్పి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు.