రజనీకాంత్ తాజా చిత్రం “పెట్ట”ను తెలుగులో “పేట”గా అనువదించి జనవరి 10న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు వెర్షన్ ప్రీరిలీజ్ ఈవెంట్ హైద్రాబాద్ లో నిన్న సాయంత్రం జరిగింది. ఈ ఈవెంట్ కి రజనీకాంత్ అటెండ్ అవ్వలేకపోయినా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు, సంగీత దర్శకుడు అనిరుధ్, హీరోయిన్లలో ఒకరైన మేఘ ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. చాలా సాధారణంగా ఎలాంటి హంగామా లేకుండా జరిగిన ఈ ఈవెంట్ నిర్మాత/డిస్ట్రిబ్యూటర్ అశోక్ వల్లభనేని సెన్సేషనల్ స్టేట్మెంట్స్ తో ఒక్కసారిగా వేడెక్కింది.
పెట్ట సినిమాకు థియేటర్లు ఇవ్వకుండా అల్లు అరవింద్, దిల్ రాజు అడ్డుపడుతున్నారని అశోక్ వల్లభనేని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. అక్కడితో ఆగకుండా అల్లు అరవింద్, దిల్ రాజులను కుక్కలు అనడం, వాళ్ళని కాల్చి చంపేయాలని కేసీయార్ ను కోరడం వంటివి లేనిపోని డ్రామాను క్రియేట్ చేశాయి. అయినా.. ఇండస్ట్రీలో ఉంటూ ఒక డబ్బింగ్ సినిమాకి థియేటర్లు ఇవ్వడం లేదని అశోక్ గొడవపడడం వెనుక అర్ధం ఏమిటనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. కొందరు దీన్ని పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపడేస్తున్నారు. ఏదేమైనా నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీలో ఒక భాగమైన అశోక్ వల్లభనేని.. ఇలా అల్లు అరవింద్, దిల్ రాజుల మీద వర్బల్ ఎటాక్ చేయడం అనేది ఎంతమాత్రం మంచిది కాదు. ఈ ఎటాక్ “పెట్ట” తెలుగు వెర్షన్ రిలీజ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది వేచి చూడాల్సిందే.