సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఆ సినిమా దర్శకుడు అని చెప్పుకోవడానికి ఎవరూ వెనుకాడరు. ఒకవేళ అలా చెప్పకపోయినా అది ఆయనదే. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ (Gautham Vasudev Menon). ఆయన కొన్నేళ్ల క్రితం తెరకెక్కించిన ఓ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడితే.. ఏమో నేను మరచిపోయా? అది నా సినిమా కాదు అని అంటున్నారు. దక్షిణాది సినిమా పరిశ్రమల్లో దిగ్గజ దర్శకుల జాబితాలో కచ్చితంగా ఉండే పేరు గౌతమ్ మీనన్.
Gautham Menon
‘కాక్క కాక్క’, ‘ఏమాయ చేసావె’ (Ye Maaya Chesave), ‘వేట్టయాడు విలయాడు’, ‘ఎన్నై అరిందాల్’ (Yennai Arindhaal).. ఇలా చాలా సినిమాలు ఆయన సృష్టే. వరల్డ్ బిల్డింగ్, ముందు, వెనుక కథలు కాకుండా ప్యూర్ యాక్షన్ సినిమాలకు, అంతే ప్యూర్ లవ్ స్టోరీలకు ఆయన ప్రసిద్ధి. అందుకే ఆ స్థాయి గౌరవం ఆయనకు ఉంది. అలాంటి ఆయన ఓ సినిమా తనది కాదు అంటున్నారు. ధనుష్ (Dhanush) హీరోగా ‘ఎన్నై నొక్కి పాయుం తోటా’ (Enai Noki Paayum Thota) అనే సినిమా తీశారు గౌతమ్ మీనన్.
అనేక సమస్యలు ఎదుర్కొని ఈ సినిమా చాలా రోజుల తర్వాత 2019లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఈ నేపథ్యంలో ఆ సినిమా గురించి గతంలో జరిగిన చర్చ ఇప్పుడు బయటకు వచ్చింది. అదే ఆ సినిమాను ధనుషే తెరకెక్కించారని. ఆ సినిమా మధ్యలోనే గౌతమ్ మీనన్ వదిలేశారు అని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడు గౌతమ్ మీనన్ మాటలు వింటుంటే అప్పుడు వచ్చిన వదంతులే నిజం అని అనిపిస్తోంది.
అన్నట్లు ఆయన ఏమన్నారో చెప్పలేదు కదా. ఓ ఇంటర్వ్యూలో ఆయన్న ఆ సినిమా గురించి అడిగితే.. “మీరు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు? ఆ సినిమా గురించి నేను మరిచిపోయాను. దాని గురించి నాకేమీ గుర్తు లేదు. అందులోని ఒక పాట మాత్రమే గుర్తుంది. అది నా సినిమా కాదు. వేరే ఎవరిదైనా అయ్యుండొచ్చు” అని వ్యాఖ్యానించారు.