‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా సీక్వెల్ ఉందని, ఆ మాటకొస్తే ఏకంగా సినిమాటిక్ యూనివర్స్ ఉందని ఇప్పటికే టీమ్ చెప్పేసింది. అయితే ప్రభాస్‌కు (Prabhas) ఇప్పుడున్న హెక్టిక్ షెడ్యూల్, టీమ్ అప్‌డేట్స్ ప్రకారం చూస్తుంటే ఇప్పట్లో సినిమా రావడం పక్కన పెడితే.. ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యే పరిస్థితే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇదే మాట దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర సమాధానం ఇచ్చారు. అంతేకాదు కథ గురించి కాస్త సమాచారం కూడా చెప్పారు.
‘కల్కి 2898 ఏడీ’ సినిమా సీక్వెల్‌కు సంబంధించి నెల రోజుల పాటు ఇప్పటికే షూటింగ్ చేశారట. అందులో 20 శాతం మంచి అవుట్‌పుట్ వచ్చిందట. అయితే సినిమాకు సంబంధించి ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని దర్శకుడు చెప్పారు. ఇలాంటి సినిమాలకు సంబంధించి యాక్షన్ సన్నివేశాలే కీలకం. అంటే సినిమాలో ముఖ్యమైన పోర్షన్స్ ఇంకా షూట్ చేయాల్సి ఉందన్నమాట.
సినిమా గురించి ఏమన్నా చెప్పొచ్చు కదా.. అని అడిగతే.. సీక్వెల్‌లో కమల్ హాసన్ (Kamal Haasan), ప్రభాస్, అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలుంటాయని, అవి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకర్షిస్తాయని చెప్పారు. తొలి పార్టు ఆఖరులో చూపించిన శక్తిమంతమైన ధనుస్సు కీలకం కానుంది అని నాగీ తెలిపారు. అశ్వత్థామ, కర్ణుడు, యాస్కిన్‌ల మధ్య ఆ ధనుస్సు కీలకంగా మారి, సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని తెలిపారు దర్శకుడు.
అన్నట్లు, ‘కల్కి 2898 ఏడీ’ కొత్త పార్టులో తన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని గతంలోనే కమల్ హాసన్ చెప్పారు. ఆ లెక్కన ఇప్పుడు నాగీ చెప్పిన మాటల్ని కలుపుకుంటే రెండో పార్టులో యాస్కిన్ విశ్వరూపం చూస్తామని అర్థమవుతోంది. జూన్ 27న విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు రూ.700కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. త్వరలోనే రూ. వెయ్యి కోట్ల మార్కును దాటికి ఇంకాస్త ముందుకు దూసుకుపోతుంది.