సీనియర్ డైరెక్టర్ శంకర్ (Shankar) కెరీర్‌లో ఓ కీలక మలుపు తిరిగినట్టుగా కనిపిస్తోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ప్లాప్ అవడంతో శంకర్ ఒక్కసారిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. తెలుగు ఇండస్ట్రీలో శంకర్ స్థాపించుకోవాలనుకున్న రేంజ్ ‘గేమ్ ఛేంజర్’ తుడిచేసినట్టైంది. దీనివల్ల వెంటనే మరో స్టార్ హీరో సినిమాను అనౌన్స్ చేసే అవకాశాలు దూరమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ ‘భారతీయుడు 3’. అయితే ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలో బజ్ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
‘భారతీయుడు 2’ (Indian 2) డిజాస్టర్ ఫలితం కారణంగా మూడో భాగంపై ఆసక్తి బాగా తగ్గిపోయింది. కొన్ని రూమర్స్ ప్రకారం ‘భారతీయుడు 3’ ఓటీటీలో రిలీజ్ అవుతుందంటూ గాసిప్స్ వచ్చాయి. అయితే మేకర్స్ క్లారిటీ ఇచ్చి థియేట్రికల్ రిలీజ్ అని వెల్లడించారు. ఇప్పటికే ‘భారతీయుడు 3’ రిలీజ్ ఆలస్యం కావడంతో ఇండస్ట్రీలో మరో రూమర్ హల్ చల్ చేస్తోంది. ‘భారతీయుడు 3’ విడుదలైన తర్వాత శంకర్ రెండు సంవత్సరాల పాటు ఎలాంటి కొత్త సినిమా చేయకుండా గ్యాప్ తీసుకోనున్నారట.
శంకర్ ఈసారి పూర్తిగా విశ్రాంతి తీసుకుని, ఫ్రెష్ మైండ్‌తో కొత్త స్క్రిప్ట్‌తో రాబోతారని టాక్. శంకర్ సాధారణంగా ఒక సినిమా పూర్తి చేసిన తర్వాత కొంత గ్యాప్ తీసుకోవడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి ప్లాప్‌లతో ఎదురయ్యే ఒత్తిడి కారణంగా గ్యాప్ మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.
మరోవైపు శంకర్ స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ ఇవ్వాలంటే కొత్త రైటర్ సహకారం తప్పనిసరి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మళ్ళీ ట్రాక్‌లోకి రావాలంటే శంకర్‌కు మంచి స్క్రిప్ట్‌తో పాటు మంచి మేకింగ్ కావాలని చెబుతున్నారు. ‘భారతీయుడు 3’ ఫలితమే శంకర్ కెరీర్‌లో తదుపరి దిశను నిర్ణయించనుంది. మరి ఈ సినిమా ఎంత వరకూ హిట్టవుతుందో చూడాలి.