టాలీవుడ్ లో ఓ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యిందంటే.. ఆ చిత్రం మానియా ఎంతకాదనుకున్నా ఒక నెల రోజులన్నా కొనసాగుతూనే ఉంటుంది. ఒక వేళ తరువాత వచ్చిన చిత్రం హిట్టయినా.. అది బ్లాక్ బస్టర్ రేంజ్ ను అందుకునేంత మాత్రం అవ్వదని టాలీవుడ్ లో ఓ బలమైన సెంటిమెంట్ ఉంది. ఇందులో ముఖ్యంగా ‘పోకిరి’ ‘విక్రమార్కుడు’ చిత్రాల్ని చెప్పుకోవచ్చు. అవ్వడానికి రెండూ హిట్టు సినిమాలే..అయితే ‘పోకిరి’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయిన తరువాత వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రం హిట్టయినప్పటికీ.. ‘పోకిరి’ ని మించలేకపోయింది. ఇక గత సంవత్సరం ‘రంగస్థలం’ చిత్రం భారీ హిట్టయ్యింది.. తరువాత ‘భరత్ అనే నేను’ చిత్రం హిట్టయినప్పటికీ ‘రంగస్థలం’ రేంజ్ విజయం కాలేకపోయింది. ఇక ‘మగధీర’ ‘అత్తారింటికి దారేది’ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచినప్పుడు.. పక్కన వచ్చిన సినిమాలేమి విజయం సాధించలేకపోయాయి.
ఇదిలా ఉండగా ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ‘ఎఫ్2’ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మిడిల్ ఆర్డర్ చిత్రాల్లో ఇప్పటివరకూ నమోదైన ‘గీత గోవిందం’ ‘ఫిదా’ కలెక్షన్లను టార్గెట్ చేసింది. పండగ ముగిసినా కూడా ‘ఎఫ్2’ జోరు తగ్గలేదు. ఇప్పటికీ ఈ చిత్రం 90 కోట్ల గ్రాస్ ను రాబట్టి 100 కోట్ల కలెక్షన్ల వైపు దూసుకుపోతుంది. దిల్ రాజు చిత్రం కాబట్టి ఎక్కువ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుండడం విశేషం. ఇదిలా ఉంటే అఖిల్ నటించిన ‘మిస్టర్ మజ్ను’ చిత్రం జనవరి 25 న విడుదల కాబోతుంది. వరుణ్ తేజ్ తో ‘తొలిప్రేమ’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన వెంకీ అట్లూరి డైరెక్షన్లో రాబోతున్న చిత్రం కావడం తప్ప.. ఈ చిత్రం పై ఎలాంటి అంచనాలు లేవు. అందులోనూ అఖిల్ చేసిన గత రెండు చిత్రాలు నిరాశపరచడంతో… ‘మిస్టర్ మజ్ను’ పై ప్రేక్షకులకి ఎలాంటి ఆసక్తి లేదు. అందుకు తగినట్టు గానే నెగెటివ్ సెంటిమెంట్లు కూడా అఖిల్ ను టెన్షన్ పెడుతున్నాయట.
డైరెక్టర్ కి రెండో చిత్రం అంటే కచ్చితంగా అది ప్లాప్ అనే బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. మొదటి చిత్రంతో ఆహా అనిపించి రెండో చిత్రంతో అబ్బా అనిపించిన డైరెక్టర్లే ఎక్కువ. ఇక మరో సెంటిమెంట్ హీరోయిన్ నిధి అగర్వాల్. నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’ చిత్రంతో డిజాస్టర్ అందుకుంది నిధి. మరి అఖిల్ కి హిట్టిస్తుందా… అనేది తెలియాల్సి ఉంది. ఇక మూడవ సెంటిమెంట్.. హీరో ఎక్కువ అమ్మాయిలు చుట్టూ తిరిగితే.. ప్రేక్షకులు నిరుత్సాహానికి గురవుతారు.. అందులోనూ రొమాంటిక్ యాంగిల్స్, నెగటివ్ షేడ్స్ తో హీరోలో ఎక్కువగా కనిపిస్తే.. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు అస్సలు జీర్ణించుకోలేరు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘ఆరెంజ్’ … యూత్ స్టార్ నితిన్ ‘హార్ట్ ఎటాక్’ చిత్రాలు. ‘మిస్టర్ మజ్ను’ లో కూడా అఖిల్ రొమాన్స్ మితిమీరినట్టే కనిపిస్తుంది. మరి ఇన్ని బ్యాడ్ సెంటిమెంట్ల మధ్యలో విడుదలవుతున్న ‘మిస్టర్ మజ్ను’ చిత్రం అఖిల్ కు ఏ రేంజ్ విజయాన్నిస్తుందో… తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే ..!