సినీతారలు అన్ని రకాల పాత్రలు పోషిస్తేనే పరిపూర్ణనటులు అనిపించుకుంటారు. కానీ స్టార్ హీరోలకు అలా చేయడానికి కుదరదు. కలక్షన్స్ కురిపించే కథలు ఎంచుకోవాలి. అభిమానులను మెప్పించే సన్నివేశాలు ఉండాలి. ఇలా కాదని ప్రయోగం చేస్తే ఫ్యాన్స్ నిరుత్సాహపడతారు. నిర్మాతలు దెబ్బతింటారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ “నా పేరు సూర్య” చేశారు. ఇది దేశభక్తి నిండిన చిత్రం. ఇందులో కామెడీకి, శృంగారానికి, ఐటెం సాంగ్స్ కి చోటు ఉండదు. మొదటి నుంచి చివరకు సీరియస్ గా సాగింది. ఇటువంటి కథని ఎంచుకొని సినీ విమర్శకుల నుంచి బన్నీ ప్రశంసలు అందుకున్నప్పటికీ అభిమానులను ఆనందింపచేయలేకపోయారు.
అందుకే కలక్షన్స్ ఆశించినదానికన్నా బాగా తగ్గాయి. సో అల్లు అర్జున్ ఈసారి ప్రయోగం జోలికి వెళ్లనని మాట ఇచ్చారు. పక్కా కమర్షియల్ కథ చేస్తానని చెప్పారు. బన్నీ నిర్ణయానికి ఫ్యాన్స్ సంతోషించారు. అయితే డైరక్టర్, నిర్మాత ఎవరు అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఫిల్మ్ నగర్ వాసుల సమాచారం మేరకు.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నటించనున్నట్లు తెలిసింది. మనం, 24 వంటి చిత్రాలతో తెలుగు, తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న డైరక్టర్ తో బన్నీ కోలీవుడ్ లోకి అడుగుపెట్టాలని చూస్తున్నారు. తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించే మాస్ మసాలా కథతో రాబోతున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.