నమ్మడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా ఈవారం తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వైష్ణవ్ తేజ్- రకుల్ జంటగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన “కొండ పొలం”, అప్పుడెప్పుడో గోపీచంద్-నయనతార జంటగా బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన “ఆరడుగుల బుల్లెట్”. నవీన్ చంద్ర హీరోగా నటించిన “నేను లేని నా ప్రేమకథ”, శివకార్తికేయన్ నటించిన “వరుణ్ డాక్టర్”. శివకార్తికేయన్ సినిమా ఒక్కటే డబ్బింగ్, మిగతావన్నీ స్ట్రయిట్ సినిమాలు. నవీన్ చంద్ర సినిమా తప్ప మిగతావన్నీ కాస్త పేరున్న సినిమాలే.
అయితే.. సదరు సినిమాలు రిలీజ్ అవుతున్నట్లు మన ఆడియన్స్ లో సగం మందికి ఇంకా తెలియదు. “కొండ పొలం” అనే సినిమా షూటింగ్ అయ్యిందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. సడన్ గా రెండు ప్రీరిలీజ్ ఈవెంట్స్ చేసేసరికి అందరూ షాక్ అయ్యారు. ఇక “ఆరడుగుల బుల్లెట్” సినిమా మీద ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. “నేను లేని నా ప్రేమకథ” అనే సినిమా ట్రైలర్ కూడా ఎవరూ చూసి ఉండరు.
“వరుణ్ డాక్టర్”కి పాటలు, ట్రైలర్ పుణ్యమా అని మంచి బజ్ ఉన్నప్పటికీ.. ఈ నాలుగు సినిమాలు ఈవారంలోనే విడుదలవుతున్నాయనే క్లారిటీ మాత్రం ఎవరికీ లేదు. “లవ్ స్టోరీ” చిత్రాన్ని నెల ముందు నుంచీ ప్రమోట్ చేస్తేనే జనాలు అంతంతమాత్రంగా థియేటర్లకు వచ్చారు. అలాంటిది ఈ సినిమాలు కేవలం వారం రోజుల ప్రమోషన్లతో థియేటర్లలో రిలీజ్ అయిపోయి ఎలా హిట్టవ్వాలనుకుంటున్నాయో అర్ధం కావడం లేదు.