చిరంజీవి అంటే పాటలు, ఫైట్లు, కామెడీ సీన్లు.. అనుకునేవారికి కొత్తగా కనిపించాడు ‘గాడ్‌ఫాదర్’. చిరును అలా కూడా చూపించొచ్చా అని దర్శకులు అనుకుంటే.. బాస్ ఇలా కూడా బాగున్నాడు అని ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే ఆశించిన స్థాయిలో డబ్బులు రాలేదు అనేది విశ్లేషకుల మాట. ఆ చర్చ అంతా పక్కనపెడితే.. సినిమాకు మంచి రేటింగ్ వచ్చింది అని అంటున్నారు. ఇప్పుడు ఏం రేటింగ్ అంటారా? టీవీ రేటింగ్.. అదేనండి టీఆర్పీ.
గతేడాది చిరంజీవికి ఏమాత్రం బాగాలేదు అనే చెప్పాలి. ఎన్నో అంచనాలతో వచ్చిన ‘ఆచార్య’ సినిమా దారుణ పరాజయం పాలైంది. ఓటీటీలోను, టీవీలోనూ సరైన ఫలితం రాబట్టలేకపోయింది. దీంతో చిరంజీవి పని ఇక అయిపోయింది అని అనుకున్నారంతా. అయితే అంత సీన్ లేదు.. అంటూ చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’తో వచ్చాడు. థియేటర్లలో ఫర్వాలేదనిపించిన ఈ సినిమా ఓటీటీలో అదరగొట్టింది అంటారు. ఇప్పుడు టీవీల్లో కూడా మంచి రేటింగ్ పాయింట్లు తెచ్చుకుంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా జెమినీ టీవీలో ఇటీవల ప్రసారమైంది ‘గాడ్ ఫాదర్’.
ఈ రీమేక్ సినిమాకు 7.7 టీఆర్పీ వచ్చిందని సమాచారం. ‘ఆచార్య’ సినిమాకు వచ్చిన రేటింగ్ కంటే ఇది ఎక్కువే. ‘సైరా’ సినిమా కంటే ‘ఆచార్య’ సినిమాకు ఎక్కువ టీఆర్పీ రాగా, ఇప్పుడు ‘ఆచార్య’ సినిమా కంటే ‘గాడ్ ఫాదర్’ సినిమాకు మంచి రేటింగ్స్ వచ్చాయి. దీంతో చిరు గ్రాఫ్ తగ్గడం లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ ఫ్లోలో ‘వాల్తేరు వీరయ్య’కు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ‘గాడ్ ఫాదర్’ టీఆర్పీ రేటింగ్ విషయంలో ‘వాల్తేరు వీరయ్య’ హ్యాండ్ కూడా ఉందని చెబుతున్నారు.
ఈ సినిమాకు వస్తున్న బజ్ ఆ సినిమాకు కూడా ఉపయోగపడి ఉండొచ్చు అని విశ్లేషకుల మాట. అన్నట్లు ‘గాడ్‌ఫాదర్’ను మోహన్ రాజా చూపించిన విధానం కూడా అభిమానులకు నచ్చడం మరో కారణం అంటున్నారు. ముందుగా చెప్పుకున్నట్లు చిరును మోహన్‌రాజా సరికొత్తగా ఆవిష్కరించారు. చిరు కూడా ఇలాంటి పాత్రలు ఎక్కువగా చేయాలి అనుకుంటున్న విషయం తెలిసిందే.