తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ (G. V. Prakash Kumar) , హీరో ధనుష్‌కి (Dhanush) మధ్య ఏం జరిగింది, ఒకప్పుడు ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. కానీ అనూహ్యంగా ఒక్కసారిగా మాట్లాడుకోవడం మానేశారు. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు ఏకంగా ఆరేళ్లు మాట్లాడుకోలేదు. అసలు ఏమైంది, ఎందుకలా చేశారు అనే విషయంలో జీవీ ప్రకాశ్ క్లారిటీ ఇచ్చారు. ఇండస్ట్రీలో జీవీ ప్రకాశ్, ధనుష్ ఇద్దరు మంచి స్నేహితులు. ధనుష్ సినిమాలకు జీవీ అద్భుతమైన సంగీతం అందించారు కూడా.
‘మయక్కం ఎన్నా’, ‘ఆడుకాలమ్’, ‘సార్’ (Sir) , ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller) లాంటి సినిమాలు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చాయి. అయితే ‘మయక్కం ఎన్నా’, ‘ఆడుకాలమ్’ సినిమాల తర్వాత వీరిద్దరూ మాట్లాడుకోలేదట. మళ్లీ ‘సార్’ సినిమా వచ్చేంతవరకు ఇద్దరూ కలసి పని చేయలేదు కూడా. ఏదైనా ఇంటర్య్వూలో ఇద్దరి గురించి ప్రస్తావించినా మాట్లాడేవారు కాదు. ఇన్నాళ్లకు ఈ విషయంపై జీవీ ప్రకాశ్ మాట్లాడారు. మా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చిన విషయం నిజమే.
అయితే ఇప్పుడు ఆ సమస్య ఏమీ లేదు. ఇప్పుడు మళ్లీ పాత రోజుల్లా స్నేహితులం అయిపోయాం అని క్లారిటీ ఇచ్చేశారు జీవీ ప్రకాశ్. అందరి స్నేహితులలాగే మా మధ్య కూడా మనస్పర్థలు వచ్చాయి. దాని వల్ల ఆరేళ్లు మాట్లాడుకోలేదు అని చెప్పారు. ఆ తర్వాత మా మధ్య పరిస్థితులు చక్కబడ్డాయని, తమ స్నేహబంధం మరింత బలపడిందని చెప్పారు. ధనుష్ ఎంతో మంచి వ్యక్తి అని, ఇష్టమైన వారికోసం ఎంత దూరమైనా వెళ్తాడని, అతడితో క్రికెట్ ఆడటం చాలా ఇష్టం అని చెప్పాడు.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన పక్కన ఓ పిల్లర్‌లా ఉండేవాడే స్నేహితుడు. మనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు నేను ఉన్నాను అనే ధైర్యం ఇచ్చేవాడే స్నేహితుడు. ధనుష్ కూడా అలాంటివాడే అంటూ గొప్పగా చెప్పారు జీవీ. ఆయన సంగీత దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ అలరిస్తున్నారు. హీరోగా నటించిన ‘బ్యాచిలర్’ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు ‘డియర్’ విడుదలకు సిద్ధంగా ఉంది.