‘‘టాలీవుడ్‌లో ఇద్దరు హీరోలు కలవడం పెద్ద విషయం కాదు.. అదే బాలీవుడ్‌లో మల్టీస్టారర్ చేయడం చాలా కష్టం’’.. ఈ మాట చెప్పింది మేం కాదు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చెప్పిన మాట. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం ఆయన చాలా క్లియర్‌గా చెప్పాడు. అయితే ఇప్పుడు ఆయన చెప్పిన మాట తేడా కొడుతోందా? అవుననే అనిపిస్తోంది ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా టీమ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే. కలిసి మెలిసి తిరిగిన టీమ్.. ఇప్పుడు చెట్టుకొకడు, పుట్టకొకడు అయిపోతాడా అనేలా మారింది అని అంటున్నారు. ఇప్పటికే ‘ఆర్‌ఆర్ఆర్’ ఫ్రెండ్‌షిప్ బీటలు వారుతోంది అని టాక్.
తారక్ – రామ్‌చరణ్ మంచి స్నేహితులు అనే విషయం ఎవరికి తెలుసు? ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా మొదలైనప్పుడు.. ఈ కాంబినేషన్ ఎలా కుదిరిందబ్బా.. రాజమౌళి ప్లానింగ్ వల్లనేమో అనుకున్నారంతా. అయితే సినిమా విడుదల సమయంలో చేసిన ప్రచారంలో తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ.. ఘనంగా చెప్పుకొచ్చారు. గతంలో తమ మధ్య జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను కూడా చెప్పుకొచ్చారు. అయితే సినిమా థియేటర్ల నుండి ఇలా వెళ్లిపోయిందో లేదో అలా స్నేహం తగ్గుతూ వచ్చింది. మధ్యలో విదేశాల్లో ప్రచారం చేసినప్పుడు కాస్త కనిపించింది.
ఆస్కార్ ప్రచారం మొదలయ్యాక మొత్తం పరిస్థితి మారిపోయింది అని చెప్పొచ్చు. ఏమైందో ఏమో… ఇటీవల కాలంలో రామ్‌చరణ్, తారక్ మధ్య అంత మంచిగా లేవు అంటున్నారు. ఆస్కార్ ప్రచారంలో ఇద్దరూ కలసి డ్యాన్స్ వేస్తారు అని వార్తలొచ్చాయి. అయితే ఆ పని జరగలేదు. ఎందుకు అని అడిగితే.. ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పారు. తారక్ ఏమో ప్రాక్టీస్ లేదు అని చెబితే, రామ్‌చరణ్ ఏమో అసలు ఇన్విటేషన్ రాలేదు అని అన్నాడు. దీంతో ఏదో తేడా అనిపించింది. ఆ తర్వాత ఆస్కార్ గురించి తారక్ చేసిన ట్వీట్‌లో రామ్‌చరణ్ పేరు కనిపించలేదు. అయితే చరణ్ ట్వీట్‌లో మాత్రం తారక్ పేరు కనిపించింది.
మొన్నీమధ్య ‘దాస్ కీ ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘నాటు నాటు..’ పాట గురించి, అవార్డు గురించి మాట్లాడుతూ సినిమా టీమ్ గురించి చెప్పాడు. అయితే అందులో రామ్‌చరణ్ పేరు లేదు. దీంతో సమ్‌థింగ్ సమ్‌థింగ్ అని మెల్లగా అన్నవాళ్లు ఇప్పుడు కాస్త గట్టిగానే అంటున్నారు. ఇదంతా వీరివైపు నుండి. అయితే టీమ్ అంతా ఒకేసారి హైదరాబాద్ ఎందుకు రాలేదు అనే విషయంలో మరో డౌట్ వస్తోంది. లేటుగా వెళ్లిన తారక్ ఎర్లీగా వచ్చేస్తే.. ఆ తర్వాత రాజమౌళి, కీరవాణి అండ్ కో. వచ్చారు. ఆఖరిగా రామ్‌చరణ్ వచ్చాడు. దీంతో అందరూ కలసి వచ్చి ఉంటే బాగుండేదిగా అంటున్నారు ఫ్యాన్స్.
ఇదిలా ఉండగా.. ‘నాటు నాటు..’ పాట పాడిన కాలభైరవ ఆస్కార్ అవార్డు గురించి ట్వీట్ చేస్తూ రామ్‌చరణ్, తారక్ పేర్లు ప్రస్తావించలేదు. దీంతో పెద్ద చర్చ జరిగింది. అయితే ఆ తర్వాత ఆయన సారీ చెప్పాడు కూడా. సినిమాలో చరణ్‌కు ఎక్కువ స్కోప్ ఉందని సినిమా రిలీజ్ సమయంలో సన్నాయి నొక్కులు వినిపించాయి. దీంతో తారక్ ఫ్యాన్స్ హర్టయ్యారు. కానీ ఆ తర్వాత ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. అయితే సినిమా ప్రచారంలో తారక్‌కి కాస్త ఇంపార్టెన్స్ ఇచ్చారనే పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలో చరణ్ అమెరికా వెళ్లే ముందు పీఆర్ టీమ్ మార్చేశాడు.
ఆస్కార్ టూర్‌లో చరణ్ గురించి కొత్త ఆస్కార్ టీమ్ చాలా కష్టపడింది. దానికి తగ్గ ప్రచారం కూడా వచ్చింది అని చెప్పొచ్చు. ఆ విషయం పక్కన పెడితే.. చరణ్ – తారక్ మధ్య దూరం ఎందుకు పెరిగింది అనే ప్రశ్నకు సమాధానం తెలియడం లేదు. ఏదైనా సినిమా విషయంలో వచ్చిందా? లేక ‘ఆర్‌ఆర్‌ఆర్’ గురించే వచ్చిందా అనేది తెలియాలి. ఎందుకంటే మల్టీస్టారర్‌ల కోసం ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఇన్నాళ్లూ ఓ పాఠంలా నిలిచింది. కానీ ఈ క్రమంలో ఎవరి ఈగోలు హర్ట్ అవ్వకుండా చూడాలని, లేకపోతే ఇబ్బంది లనే గుణపాఠం కూడా ఈ సినిమానే చెబుతుంది.