సన్నీ డియోల్, గోపిచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో వచ్చిన మాస్ ఎంటర్‌టైనర్ జాట్ (Jaat) విడుదల సమయంలో భారీ అంచనాలు రేకెత్తించినా, ఫలితంగా మాత్రం అంచనాలకు తగ్గ స్థాయిలో నిలబడలేకపోయింది. మొదటి వారానికి ఓపెనింగ్స్ వచ్చినా, రెండో వారంలో సినిమా కలెక్షన్లు గణనీయంగా పడిపోయాయి. థియేట్రికల్‌గా అంతగా నిలబడని సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ ‘జాట్ 2’ అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా హిట్ అయిన సినిమాలకు మాత్రమే సీక్వెల్ ప్లాన్ చేస్తారు.
కానీ జాట్ కేవలం 70 కోట్లు వరల్డ్‌వైడ్ గ్రాస్ సాధించడంతో ఇది బ్రేక్ ఈవెన్ దశను కూడా తాకలేదు. అంతేకాదు, ఓవర్సీస్ మార్కెట్‌లో అయితే డిజాస్టర్ స్థాయికి చేరిందన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో సీక్వెల్ అనౌన్స్‌మెంట్ చేసేంతగా ఆసక్తికరమైన ఫలితాలు ఈ సినిమాకు లేవు. అయితే ఈ తరహా నిర్ణయం వెనుక వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటి వరకు వచ్చిన నష్టాల నుంచి కొంత రికవరీ సాధించాలనే ఉద్దేశంతోనే మైత్రీ ‘జాట్ 2’ అనే ప్రకటన ఇచ్చి ఉంటారని ట్రేడ్ అనలిస్టులు అంటున్నారు. సీక్వెల్ వస్తోందన్న వార్తలతో ఆడియన్స్‌లో సినిమాపై మళ్లీ ఆసక్తి కలిగించాలన్నది అసలైన ఉద్దేశమని చెబుతున్నారు. అసలే సినిమాకు 150 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇంకొక కీలక అంశం ఏమిటంటే.. జాట్ సినిమాకు సన్నీ డియోల్ రూ.50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు బజ్.
దీంతో ఈ సినిమాకు బడ్జెట్ కంట్రోల్ దాటిపోయింది. శాటిలైట్, ఓటీటీ హక్కులు ఇంకా క్లియర్ కాకపోవడంతో మిగిలిన పెట్టుబడి రికవరీ కష్టమేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అలాంటి టైంలో “జాట్ 2” ప్రకటన పెట్టుబడిని నిలబెట్టే ప్రయత్నంగా కనిపిస్తోంది. మొత్తానికి ఈ సీక్వెల్ ప్రకటన నిజంగా ప్రాజెక్ట్ ప్రారంభానికి సంకేతమా.. లేక ఇప్పటి వరకు వచ్చిన నష్టాలపై మళ్లీ ఒకసారి పాజిటివ్ బజ్ తీసుకొచ్చే వ్యూహమా.. అన్నదే ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.