టాలీవుడ్‌లో ఆదాయపన్ను శాఖ దాడులు సంచలనం రేపుతున్నాయి. ఈసారి ప్రధానంగా దిల్ రాజు (Dil Raju) , అతని అనుబంధ సంస్థలు, బంధువులపై ఐటీ అధికారులు దృష్టి పెట్టారు. సంక్రాంతి కానుకగా విడుదలైన “సంక్రాంతికి వస్తున్నాం” (Sankranthiki Vasthunam), “డాకు మహారాజ్”(డిస్ట్రిబ్యూషన్) (Daaku Maharaaj) సినిమాలు భారీ వసూళ్లను సాధించగా, దీనిపై ఆదాయపన్ను శాఖ విచారణ ప్రారంభించిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అసలు కారణం దిల్ రాజు నిర్మించిన “గేమ్ ఛేంజర్” (Game Changer) అనే టాక్ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. గేమ్ ఛేంజర్ సినిమా విడుదలకు ముందు భారీ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంది.
Dil Raju
సినిమా నిర్మాణ సమయంలో తీసుకున్న ఫైనాన్స్, విడుదలకు ముందు జరిగిన పెద్ద మొత్తాల లావాదేవీలు ఐటీ అధికారుల దృష్టిలో పడినట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా, ఫైనాన్షియర్ సత్య రంగయ్య ప్రసాద్, మ్యాంగో మీడియా రామ్ లాంటి వ్యక్తులు చివరి నిమిషంలో చేసిన ఆర్థిక సాయం వల్లే సినిమా సాఫీగా రిలీజ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఆ లావాదేవీలు ఎలా జరిగాయి అనే దానిపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టినట్లు టాక్. ఇక సినిమా విడుదల తర్వాత వచ్చిన కలెక్షన్ పోస్టర్లు, ఆర్థిక లావాదేవీలపై గందరగోళం పెరిగింది.
సంక్రాంతి రేసులో విజయం సాధించిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో దిల్ రాజు తన ఆర్థిక పరిస్థితిని కొంత స్థిరపరచుకున్నా, ఆ వసూళ్ల లెక్కల విషయంలో ఇంకా అనేక సందేహాలు ఉన్నాయని మరో టాక్ వస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణం, విడుదల సమయంలో ఈ విధమైన ఆర్థిక లావాదేవీలు ఐటీ దాడులకు కారణమవుతున్నట్లు అనిపిస్తోంది. టాలీవుడ్‌లో ఇటువంటి దాడులు మరోసారి పరిశ్రమలో ఆర్థిక పారదర్శకతపై చర్చలకు దారితీస్తున్నాయి.
పెద్ద సినిమాలకు పెట్టుబడులు ఎలా సమకూరుతున్నాయి? ఫైనాన్స్ ఎలా నిర్వహిస్తున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు అందడం అవసరం. ఈ దాడులు పరిశ్రమలో ఆర్థిక వ్యవస్థను మరింత నిబద్ధంగా మార్చే మార్గాన్ని చూపుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, గేమ్ ఛేంజర్ వల్ల దిల్ రాజు ఇప్పటివరకు ఎదుర్కొన్న సవాళ్ల కంటే పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నట్లు అనిపిస్తోంది. సినిమా ఆర్థిక లావాదేవీలపై ఉన్న సందేహాలు తొలగడం కోసం ఇంకా సమగ్ర విచారణ జరగాల్సి ఉంది. మరి చివరికి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.