అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తెలుగులో సినిమా చేస్తే బాగుండు అని చాలా ఏళ్ల నుండి ప్రేక్షకులు అనుకుంటూనే ఉన్నారు. ఎట్టకేలకు ఆమె ఎన్టీఆర్ (Jr NTR) ‘దేవర’ (Devara) సినిమాను ఓకే చేయడంతో హమ్మయ్య ‘మన జాను పాప’ వచ్చేస్తోంది అని సంబరపడ్డారు. ఇక సినిమా ప్రచారం మొదలు కాగానే ఆమె క్యూట్ స్పీచ్‌లు విని.. తెలుగులో ఎలా మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది అని వెయిట్ చేశారు. కట్ చేస్తే ఆ రోజు వచ్చింది.. కానీ కొన్ని కారణాల వల్ల ఈవెంట్ జరగలేదు.
Janhvi Kapoor
దీంతో జాన్వీ కూడా బాధపడుతూ తారక్ లాగే ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేసింది. అందులో ఆమె క్యూట్ స్పీచ్ విని అభిమానులు మురిసిపోతున్నారు. కొంతమంది అయితే ఇలాంటి స్పీచ్ లైవ్‌లో ఉండి ఉంటే సూపర్ అని అనుకుంటున్నారు. కానీ ఏం చేస్తాం నిర్వహణ విషయంలో ఏర్పడిన కొన్ని లోపాల వల్ల మొత్తంగా తేడా కొట్టేసింది. ఈవెంట్ ఆగిపోయింది. ఇక జరిగే పరిస్థితి కూడా లేదు అనుకోండి. ఆ విషయం వదిలేసి జాన్వీ ఏమందో చూద్దాం.
జాన్వీ కపూర్ అచ్చ తెలుగులో చాలావరకు మాట్లాడింది. నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు, నాపై ఇంత ప్రేమను చూపిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. నన్ను జానూ పాప అని పిలుస్తున్న తారక్ అభిమానులకు కృతజ్ఞతలు. నన్ను మీరు సొంత మనిషిలా భావించడం సంతోషాన్నిస్తోంది. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. మా అమ్మకు, నాకూ మీరందరూ అంతే ముఖ్యం. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీరు గర్వపడేలా రోజూ కష్టపడతాను అని చెప్పింది జాన్వీ.
తెలుగులో ‘దేవర’ నా మొదటి అడుగు. కొరటాల శివ (Koratala Siva) , ఎన్టీఆర్ నన్ను ఈ సినిమాకు ఎంపిక చేయడం నా అదృష్టం. మా ప్రయత్నం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ మాటలను స్వయంగా ఈవెంట్‌లో చెప్పాలనుకున్నాను. కానీ ఈసారికి కుదరలేదు. త్వరలోనే అందరినీ కలుస్తాను అని చెప్పింది. సెప్టెంబర్ 22న చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని భావించింది. అయితే ఎక్కువమంది ప్రేక్షకులు రావడం, ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటం వల్ల రద్దు చేశారు.