లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘జయహో రామానుజ’. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి , హీరోయిన్ జో శర్మ, సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ జూలై 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘జయహో రామానుజ’ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
శ్రీ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ – దేవుడి ముందు అందరూ సమానమేననే గొప్ప సందేశాన్ని మానవాళికి అందించిన గురువు శ్రీ రామానుజాచార్యుల వారు. కుల, మత బేధం లేకుండా మనుషులంతా ఒక్కటేనని ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కరం పాటించాలి. ఆ శ్రీ రామానుజాచార్యుల వారి అనుమతితోనే జయహో రామానుజ సినిమాను సాయి వెంకట్ రూపొందించాడని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ప్రయత్నాలు జరగాలి. మానవాళి బాగుండాలని కోరుకుంటూ సాయి వెంకట్ కు నా తరుపు ఆశీస్సులు అందజేస్తున్నాను. అన్నారు.
నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ – నా మిత్రుడు లయన్ సాయి వెంకట్ జయహో రామానుజ వంటి గొప్ప సినిమాను రూపొందించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మేకింగ్ లో స్క్రిప్ట్ మొత్తం సాయి వెంకట్ మనసులోనే ఉంది. ఆయనకు ఏ సీన్ ఎప్పుడు ఎలా రూపొందించాలనేది కంఠస్థంగా వచ్చింది. ఏ స్టార్ హీరో సినిమా అయినా మూడు నెలలు మించి తీయరు. ఈ సినిమాను సాయి వెంకట్ రెండేళ్లు రూపొందించాడు. జయహో రామానుజ నా మిత్రుడు సాయి వెంకట్ కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నారు.
దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ – నా చిన్నప్పుడు ఇలాంటి గొప్ప చిత్రాలు తెరపై చూసేవాళ్లం. ఆ తర్వాత ఎందుకోగానీ ఇలాంటి మంచి సినిమాలు కరువయ్యాయి. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారి అన్నమయ్య చూశాం. ఇప్పుడు మళ్లీ ఓ గొప్ప ప్రయత్నం జయహో రామానుజ సినిమా ద్వారా డా.లయన్ సాయి వెంకట్ చేస్తున్నందుకు ఆయనను అభినందిస్తున్నా. అన్నారు.
బీసీ కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ మాట్లాడుతూ – కుల, మతాలకు అతీతంగా సమ సమాజం కోరుకున్న ఆధ్యాత్మిక విప్లవకారుడు శ్రీ రామానుజాచార్యుల వారు. అలాంటి గొప్ప గురువు జీవిత కథను సినిమాగా రూపొందించిన సాయి వెంకట్ గారికి అభినందనలు. ఇది మనందరి సినిమా. ఈ చిత్రాన్ని విజయవంతం చేసి ప్రపంచానికి శ్రీ రామానుజాచార్యుల వారి గొప్పదనం మరోసారి తెలియజేయాలి. అన్నారు.
టీడీపీ నాయకురాలు జ్యోత్స్న మాట్లాడుతూ – మనకు గొప్ప బాట చూపించిన గురువు శ్రీ రామానుజాచార్యుల వారు. ఆయన చరిత్రను ఈతరం వారికి చెప్పే ప్రయత్నం చేయడం గొప్ప విషయం. సాయి వెంకట్ గారు జయహో రామానుజ ద్వారా చేసిన ఈ ప్రయత్నానికి మనందరి సపోర్ట్ అందివ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
నిర్మాత శోభారాణి మాట్లాడుతూ – నేను శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తురాలిని. ఆ స్వామినే సాయి వెంకట్ చేత ఈ జయహో రామానుజ సినిమాను రూపొందించేలా చేశాడని నమ్ముతున్నాను. ఏదో ఆశించి సాయి వెంకట్ గారు ఈ సినిమా రూపొందించలేదు. తనలోని భక్తిని ఈ సినిమా ద్వారా చూపిస్తున్నారని భావిస్తున్నాను. అన్నారు.
పొలిటికల్ లీడర్ వేణుగోపాలాచారి మాట్లాడుతూ – వెయ్యేళ్ల కిందటే కుల మతాలకు అతీతంగా సమాజాన్ని జాగృతం చేసిన గొప్ప గురువు శ్రీ రామానుజాచార్యుల వారు. మనుషులంతా ఒక్కటేననే ఆయన సందేశం సదా ఆచరణీయం. ఆ సమతామూర్తి జీవితానికి తెరరూపం ఇస్తున్న సాయి వెంకట్ అదృష్టవంతుడు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రయత్నంలో భాగమయ్యారు. వారందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నా. అన్నారు.
నిర్మాత నటుడు గురురాజ్ మాట్లాడుతూ – జయహో రామానుజ చిత్రంలో ఆ రామానుజాచార్యుల వారికి గురువు పాత్రలో నటించాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. సాయి వెంకట్ నా మిత్రుడు. ఈ సినిమాను ఎంతో ఇష్టంతో రూపొందించాడు. ప్రతి డైలాగ్ నేర్పించాడు. ఆయన కమిట్ మెంట్ డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయా. ఈ సినిమా తర్వాత నాకు మంచి క్యారెక్టర్స్ వస్తాయని ఆశిస్తున్నా. అన్నారు.
దర్శకుడు, హీరో డా.లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ – మహిళల్ని గౌరవించాలని, కుల మతాలకు అతీతంగా ఐకమత్యంతో మానవాళి ఉండాలని సందేశాన్ని ఇచ్చిన గొప్ప గురువు భగవత్ శ్రీ రామానుజాచార్యుల వారు. ఆయన గొప్పదనం ఈ తరం వారికి తెలియాలనే ఉద్దేశంతో జయహో రామానుజ చిత్రాన్ని రూపొందించాను. పదేళ్ల క్రితమే ఈ సినిమాకు అంకురార్పణ చేశాను. సమతామూర్తి విగ్రహాన్ని మన దగ్గర ప్రధాని, రాష్ట్రపతి వంటి పెద్ద వాళ్లు వచ్చి ఆవిష్కరించినప్పుడు తెలుగు రాష్ట్రాల వారితో పాటు ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఎవరు రామానుజాచార్యులు అని తెలియని వారు తెలుసుకోవడం ప్రారంభించారు. అన్నమయ్య సినిమా తర్వాతే ఆయన గురించి విస్తృతంగా అన్ని తరాల ప్రజలకు తెలిసింది. జయహో రామానుజ చిత్రంతో ఆయన గొప్పదనం తెలియజేయాలని సంకల్పించాను. ఇవాళ మా సినిమా ట్రైలర్ లాంఛ్ చేసుకోవడం ఎందరో పెద్దలు నన్న ఆశీర్వదించేందుకు కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. జయహో రామానుజ సినిమా రూపకల్పనకు రెండేళ్ల సమయం పట్టింది. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. అన్నారు.
నిర్మాత ప్రవళ్లిక మాట్లాడుతూ – భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో జయహో రామానుజ చిత్రాన్ని నిర్మించాలనేది నాన్నగారి కల. ఆ కలను సాకారం చేయడంలో భాగస్వామి అయినందుకు గర్వంగా ఉంది. నాన్నకు కృతజ్ఞతలు చెబుతున్నా. జయహో రామానుజ చిత్ర ట్రైలర్ లాంఛ్ కు ఎందరో పెద్దలు వచ్చి ఆశీర్వదించడం శుభసూచకంగా భావిస్తున్నా. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రాన్ని నిర్మించాను. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం. మీరంతా మీ ఆదరణ చూపిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.