తమిళ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi) తన భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్టు మొన్నామధ్య ఓ ప్రెస్ నోట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తమ నిర్ణయాన్ని, ప్రైవసీని అభిమానులు కూడా గౌరవించాలి అని జయం రవి ఆ నోటీసులో కోరడం జరిగింది.అయితే ఆర్తి మాత్రం రవి విడాకులు ఇవ్వాలనుకుంటున్నట్టు.. తనకి అస్సలు తెలీదని.., భర్తకు విడాకులు ఇచ్చే ఆలోచన కూడా లేదని ఓ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో కోర్టు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి..
ఇద్దరూ కలిసుండేలా చేయాలని తీర్పు ఇవ్వబోతుంటే.., రవి మాత్రం ఆమెతో కలిసుండటం అస్సలు ఇష్టం లేదన్నట్టు చెప్పి, తనకు కచ్చితంగా విడాకులు కావాలన్నట్లు కోర్టుని వేడుకున్నాడు. దీంతో ఆర్తి కూడా మాకు విడాకులు ఇచ్చేయాలని రివర్స్ అయ్యింది. ఇక తదుపరి విచారణలో రవిని ఆర్తి ఇంటి నుండి బయటకు వెళ్లిపోవాలని ఒత్తిడి చేసినట్లు అతను చెప్పుకొచ్చాడు. పిల్లల్ని కూడా కలవనివ్వకుండా చేస్తున్నట్టు అతను ఆరోపించాడు. మరోపక్క తనను తీవ్రంగా వేదిస్తున్నట్టు ఆర్తి తెలిపింది.
దీంతో కోర్టు…. వీరి విడాకుల వ్యవహారాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా జరిగిన విచారణలో ఆర్తి.. రవి నుండి విడాకులు తీసుకోవడానికి సిద్దమే.. కానీ భరణంగా తనకు నెలకు రూ.40 లక్షలు కావాలని డిమాండ్ చేసిందట. ఈ అంశంపై రవి మోహన్ తనదైన శైలిలో స్పందించాడు. ఫోన్లో మాట్లాడుతున్నట్లు ఓ ఫోటో షేర్ చేసి ‘సమాచారం అందింది’ అంటూ రాసుకొచ్చాడు. దీనిపై రవి ఉద్దేశం ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. రవి- ఆర్తి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే.