సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ మరోసారి నట విశ్వరూపాన్ని చూపించనున్నాడు. పా రంజిత్ దర్శ కత్వంలో తెరకెక్కిన కబాలి చిత్రంలో రజనీ గ్యాంగ్ స్టర్ గా అద్భుత నటనను ప్రదర్శించాడు. ఈ చిత్ర టీజర్ యూ ట్యూబ్ లో కొత్త రికార్డులను సృష్టించింది. తన ఒక్కడికే సొంతమైన స్టైల్ తో డైలాగ్ చెప్పి అభిమానులను మెప్పించాడు. ఈ సినిమా తెలుగు ఆడియో ఆదివారం విడుదలైంది. సంతోష్ నారాయణన్ ఇచ్చిన సరికొత్త ట్యూన్స్ సంగీత ప్రియుల మనసు దోచుకుంటున్నాయి.
1. ఒకడే ఒకడొకడే
కబాలి చిత్రం ఆల్బమ్ లో తొలి పాట “ఒకడే ఒకడొకడే” పూర్తి ఎనర్జిటిక్ కా సాగుతుంది. ఇందులో “కంటి సైగ శాసనం అవుతుంది కదరా”.. “కబాలి వస్తుండు జై కొట్టు” వంటి ప్రయోగాలతో అనంత శ్రీరామ్ హై ఓల్టేజ్ సాహిత్యాన్ని అందించారు.
2. గుండె నిండా ఎన్నో
వెన్నెల రాత్రిలా “గుండె నిండా ఎన్నో” పాట సాగుతుంది. ఈ మెలోడీ సాంగ్ కు అనంతు, శ్వేతా మోహన్ ల గాత్రం ఎక్కడికో తీసుకు పోతుంది. అనంత శ్రీరామ్ తమిళ సాహిత్యం అర్ధం మారకుండా చక్కగా అనువాదం చేశారు. సంగీత దర్శకుడు ఈ పాటకు స్పానిష్ రుంబా ఫ్లేవర్ అద్ది కొత్త అనుభూతిని కలిగించారు.
3 . ఉగ్ర త్రినేత్రుడా
డ్రమ్స్ దరువులు.. జాజ్ మేళవింపుతో “ఉగ్ర త్రినేత్రుడా” ఉరకలెత్తిస్తుంది. “ఉరిమే కన్నేదిరా.. అణిచే చెయ్యేదిరా” “ఎన్నేళ్లకు ఉగాదిరా.. కన్నీళ్లకు సమాధిరా ” .. అంటూ రామజోగయ్యశాస్త్రి పెన్ నుంచి వచ్చిన పొడి పొడి పదాల పాట.. పవర్ ఫుల్ గా ఉంది.
4. కలవని ఓ నది కోసం
జీవితంలోని ఫిలాసఫీని నింపినట్లుగా “కలవని ఓ నది కోసం” పాట ఉంటుంది. చాలా స్లోగా సాగుతూ గుండె పొరల్లో దాగున్న కన్నీటి చెమ్మను బయటకు తెచ్చేలా వనమాలి సాహిత్యాన్ని ఇచ్చారు. ప్రదీప్ కుమార్ ఎంతో ఫీల్ తో పాడిన ఈ పాట ఈ ఆల్బమ్ లో సైలంట్ కిల్లర్ గా నిలిచింది.
5. నిప్పురా
కబాలి టీజర్ ద్వారా ప్రపంచమంతా పరిచయమైన “నిప్పురా” పాట పూర్తిగా వింటుంటే సూపర్ స్టార్ పవర్ కి నిప్పు తోడయినట్లు ఉంటుంది. తమిళ సాహిత్య ప్రభావం పడకుండా వనమాలి తెలుగు లిరిక్స్ అందించారు.
పాటలన్నీ రజనీకాంత్ బాడీ ల్యాంగ్వేజ్ కి సరిగ్గా సూటయ్యేలా ఉన్నాయి. ఏ పాటకు ఆ పాట ప్రత్యేకతను చాటుకునేలా సంతోష్ నారాయణన్ స్వరపరిచారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఆల్బంలన్నింటిలో బెస్ట్ ఆల్బం గా కబాలి నిలుస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.