కొన్ని సినిమాలకు టీజర్లు, ట్రైలర్లు చూసి కథ చెప్పేయొచ్చు. చాలా వరకు అలా తెలిసిన కథలు, చెప్పిన కథలు నిజం అవుతూ ఉంటాయి కూడా. అయితే రెండు ట్రైలర్లు ఇచ్చినా సినిమా గురించి ఇంకా ఓ అంచనా రావడం లేదు అంటే ఏమనుకోవాలి? అలా అని కథ పూర్తిగా చెప్పలేదని కాదు. చూచాయగా సినిమా ఎలా ఉంటుంది, ప్లాట్ ఏంటో చెప్పేశారు. అయితే సినిమాలో అసలు మేటర్ ఈ ట్రైలర్‌లో, ఇంకా చెప్పాలంటే ఈ సినిమా ఉండదు అని అనిపిస్తోంది.
ఆ రెండు ట్రైలర్లు వచ్చిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) అని మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్ (Prabhas) – నాగ్ అశ్విన్ (Nag Ashwin) – కమల్ హాసన్ (Kamal Haasan) – దీపిక పడుకొణె (Deepika Padukone) – అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. ఈ నెల 27న విడుదలవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రెండు ట్రైలర్లు వచ్చాయి. అందులో సినిమా ప్రారంభం గురించి కొన్ని ఆనవాళ్లు, పాత్రలు, ‘కల్కి’ ప్రపంచం మీద మాత్రమే దృష్టి పెట్టారు అని అర్థమవుతోంది.
అంతేకాదు సినిమాలో ఇలానే ఉంటుంది అని చెబుతున్నారు. సినిమా బృందం చెప్పిన వివరాలు, వస్తున్న లీకుల ప్రకారం సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి. ట్రైలర్లలో చూపించిన పాత్రలు కంటే ఇంకా చాలానే సినిమాలో దాచారట. అవన్నీ పరిచయం చేయడానికి, ప్లాట్‌ను అర్థమయ్యేలా చెప్పడానికి కనీసం రెండున్నర గంటలు పడుతుంది అని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా రెండు పార్టులు అవ్వడం కన్‌ఫామ్ అని అంటున్నారు.
అంతేకాదు సినిమా కథలో మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ అంతా రెండో పార్టులోనే పెట్టారట. యాస్కిన్ (కమల్ హాసన్) పాత్ర సినిమా క్లైమాక్స్‌లో వస్తుందని, ఆయన అసలు నట విశ్వరూపంలో రెండో పార్టులో చూస్తారు అని అంటున్నారు. ఈ లెక్కన ‘కల్కి 2898 ఏడీ’ అసలు కథంతా రెండో పార్టులోనే పెట్టారని టాక్. అయితే సినిమా ఎండింగ్ కార్డ్స్ వరకు రెండో పార్టు విషయం చెప్పరు అని అంటున్నారు.