కంటెంట్ తో మ్యాజిక్ చేస్తున్న ఏకైక సౌత్ ఇండస్ట్రీ “మలయాళం” అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా హయ్యస్ట్ సక్సెస్ రేట్ మైంటైన్ చేస్తున్న ఏకైనా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కూడా అదే. ఆల్రెడీ ఈ ఏడాది బోలెడు హిట్లు కొట్టి టాప్ పొజిషన్ లో ఉన్న మలయాళం ఇండస్ట్రీ ఈవారం మరోసారి షాక్ ఇచ్చింది. ఈ శుక్రవారం మలయాళం నుండి వచ్చిన తాజా సినిమా “కిష్కింద కాండం” (Kishkindha Kaandam) .
Kishkindha Kaandam
ఆసిఫ్ అలీ (Asif Ali) , అపర్ణ (Aparna Balamurali ) , విజయరాఘవన్ (Vijayaraghavan) లు ప్రధాన పాత్రధారులుగా దింజిత్ అయ్యథాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిన్న విడుదలై అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అల్జైమర్స్ తో బాధపడే ఓ తండ్రి, తండ్రి సమస్యను ట్రీట్ చేయడానికి ప్రయత్నించే కొడుకు, ఈ తండ్రీకొడుకుల జీవితాల్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన కోడలుగా అపర్ణ పాత్రలు మొదట్లో ఏదో నార్మల్ ఫ్యామిలీ డ్రామాలా అనిపించినా.. ఇంటర్వెల్ ట్విస్ట్ గా ఇంట్రస్ట్ పెంచి..
క్లైమాక్స్ తో పెద్ద షాక్ ఇచ్చాడు దర్శకుడు. మిస్టరీ థ్రిల్లర్స్ ను తెరకెక్కించడంలో సిద్దహస్తులైన మలయాళ చిత్రసీమ ఈ “కిష్కింద కాండం”తో తమ సత్తాను మరోసారి ఘనంగా చాటుకుంది. అదే మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చి అన్నీ భారతీయ భాషల్లో రూపొంది, ఆఖరికి హాలీవుడ్ రీమేక్ కు సైతం సిద్దమైన “దృశ్యం”కు ఏమాత్రం తీసిపోని విధంగా “కిష్కింద కాండం” (Kishkindha Kaandam) ఉందని చెప్పొచ్చు.
ముఖ్యంగా క్లైమాక్స్ లో ప్రేక్షకుల మనసుల్ని తొలిచే ఓ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ముగించిన విధానం ప్రశంసనీయం. మలయాళ సినిమాలను ఇష్టపడే వాళ్లు మాత్రమే కాకుండా.. థ్రిల్లింగ్ డ్రామా సినిమాలను సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. హైద్రాబాద్ లో సబ్ టైటిల్స్ తో ప్లే అవుతున్న ఈ చిత్రాన్ని మీరూ ఓ లుక్కేయండి!