సినిమాల్లో ట్రైలర్, టీజర్ రిలీజ్‌లు వాయిదా పడటం చూసుకుంటాం, సినిమా విడుదల పోస్ట్ పోన్ అవ్వడం చూసుంటాం. కానీ ఓటీటీలో అలాంటి పరిస్థితి ఎప్పుడూ కనిపించలేదు. ఏదైనా టెక్నికల్ ఎర్రర్ వస్తే ఓ గంట, రెండు గంటలు ఆలస్యం చూసే అవకాశం ఉంటుంది. కానీ ఓ ఓటీటీలో సినిమా రిలీజ్ ఏకంగా వారం వాయిదా వేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఆ వాయిదా పడిన సినిమా ‘క్రాక్’. వాయిదా వేసింది అచ్చ ‘టాలీవుడ్’ ఓటీటీ ‘ఆహా’.
సంక్రాంతికి వచ్చిన ‘క్రాక్’ను ఈ నెల 29న ‘ఆహా’లో విడుదల చేయాల్సింది. మరో నాలుగు రోజులు ఆగితే మొబైల్స్‌లో చూసేద్దాం అని అందరూ అనుకుంటుండగా 25న రాత్రి 8 తర్వాత ‘ఆహా’ ఓ ట్వీట్ చేసింది. ముందుగా అనుకున్నట్లు సినిమాను 29న విడుదల చేయడం లేదనేది ఆ ట్వీట్ సారాంశం. థియేటర్లలో ఇంకా సినిమా విజయవంతంగా ఆడుతున్న నేపథ్యంలో వారం వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అంటే ఫిబ్రవరి ఐదున సినిమాను ఓటీటీలోకి వస్తోంది.
ఏ వుడ్‌లోనూ జరగని వింతలు విచిత్రాలు టాలీవుడ్‌లో జరుగుతుంటాయని అందరూ అంటుంటారు. మన కథలు, నేపథ్యాలు, గొడవలు, పోలికలు, ఫ్యాన్స్ వార్‌లు ఇంకెక్కడా ఉండవు. అలా ఇప్పుడు విడుదల వాయిదాతో తెలుగు ఓటీటీ… తెలుగు ఓటీటీయే అని ఓటీటీయన్స్ జోక్‌లు వేసుకుంటున్నారు. ఏదైతేముంది నానా ఇబ్బందులు పడి విడుదలైన ‘క్రాక్’ ఇప్పుడు విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతుండటం ఆనందమే కదా.