ఎక్కడ పుడతామో తెలియదు. కానీ ఎక్కడ చనిపోవాలి అనేది మాత్రం మనమే నిర్ణయించుకోవచ్చు అంటుంటారు పెద్దలు. అలా రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా తన చావు ఎలా ఉండాలో ముందుగానే నిర్ణయించుకున్నారట. దీని గురించి గతంలో కొన్ని సందర్భాల్లో ప్రస్తావించారు కృష్ణంరాజు. అయితే ఆయన అనుకున్నట్లుగా ఆయన ఆఖరి రోజులు సాగలేదు. ఇంతకీ కృష్ణంరాజు ఏమన్నారంటే…కృష్ణంరాజు ఎలా చనిపోవాలనుకుంటున్నారో సుమారు 16 ఏళ్ల క్రితమే అనుకున్నారు. ఆ సమయంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని చెప్పుకొచ్చారు.
అప్పుడు ఆయన చెప్పిన మాటలు, ఇప్పుడు వైరల్‌గా మారాయి. ‘‘పచ్చని చెట్ల నీడలో కూర్చొని, నా జీవితంలో నేను ఎవరికీ అన్యాయం చేయలేదని, గుండెల మీద చేతులు వేసుకుని, నిర్మలమైన ఆకాశం వంక చూస్తూ నా తుదిశ్వాస విడవాలి. ఆ రోజూ, ఈ రోజూ.. ఏ రోజైనా అదే నా కోరిక’’ అని చెప్పుకొచ్చారు కృష్ణంరాజు. ఈ మాటలను ఇప్పుడు విని, గుర్తు చేసుకుంటున్న అభిమానులు.. కృష్ణంరాజు వ్యక్తిత్వం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు అని అంటున్నారు.
ఎందుకంటే మామూలుగా చాలామంది ‘బాగా సంపాదించాలి’, ‘మంచి గుర్తింపు పొందాలి’ అని అనుకుంటూ ఉంటారు. ‘నేనెవరికీ అన్యాయం చేయలేదని గుండె మీద చేయి వేసుకుని కన్నుమూయాలి’ అని కృష్ణంరాజు అనుకున్నారు. నిజానికి ఈ మాటల్ని కృష్ణంరాజు అప్పటికి కొద్ది రోజులకు ముందే ఓ వ్యక్తి దగ్గర అన్నారు. ఆయనే, నాగార్జున ఫెర్టిలైజర్స్ కేవీకే రాజు. ఆయనతో మాట్లాడుతూ కృష్ణంరాజు ప్రతి మనిషికీ ఓ జీవిత లక్ష్యం ఉండాలంటారు అంటూ తన చావు ఎలా ఉండాలో చెప్పారట.
ఆ విషయాల్ని ఓ ఇంటర్వ్యూలో అందరికీ వివరించారు. ఆయన అనుకున్నట్లు పచ్చని చెట్ల కింద కనుమూయలేదు కానీ.. ఎవరినీ నొప్పించకుండా ఆయన కోరుకున్నట్లుగా ఎవరికీ అన్యాయం చేయలేదు అనే సంతృప్తితోనే కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నిర్వహిస్తున్నారు. చేవెళ్ల, మొయినాబాద్ దగ్గరలోని ఓ ఫామ్ హౌస్‌లో నిర్వహిస్తున్నారు.