కళాతపస్వి కె . విశ్వనాథ్ గారు నిన్న రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ మొత్తం శోకసంద్రంలో మునిగితేలుతోంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథ్ గారు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా రేపల్లె మండంలోని పెద పులివర్రు గ్రామానికి చెందిన ఈయన కెరీర్ ప్రారంభంలో చెన్నైలోని ఒక స్టూడియో సౌండ్ రికార్డిస్టుగా తన సినీ కెరీర్ ను ప్రారంభించారు.
అటు తర్వాత బాలచందర్ వంటి దర్శకుల స్పూర్తితో డైరెక్షన్ విభాగంలోకి అడుగుపెట్టారు. ముందుగా 1951 లో వచ్చిన ‘పాతాళ భైరవి’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. కొన్నాళ్ల తర్వాత ‘ఆత్మగౌరవం’ చిత్రంతో దర్శకుడిగా మారిన విశ్వనాథ్ గారు అటు తర్వాత… ‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’, ‘శృతి లయలు’, ‘సిరివెన్నెల’, ‘స్వర్ణకమలం’, ‘స్వాతికిరణం’ వంటి ఎన్నో గొప్ప చిత్రాలను మనకు అందించారు. నటుడిగా కూడా 30 కి పైగా సినిమాల్లో నటించారు.
ఈయన డైరెక్ట్ చేసిన ‘స్వాతిముత్యం’ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచింది. 1992 వ సంవత్సరంలో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. అదే ఏడాది పద్మశ్రీ అవార్డు కూడా ఈయన్ని వెతుక్కుంటూ వచ్చింది. అలాగే ఈయన తెరకెక్కించిన ‘స్వరాభిషేకం’ చిత్రం నేషనల్ అవార్డుని కైవసం చేసుకుంది.
అలాగే 2016 లో దాదాసాహెబ్ పాల్కే అవార్డుతో పాటు 5 నంది అవార్డులు, 10 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు విశ్వనాథ్ గారు. ఇలాంటి గొప్ప ఖ్యాతిని సంపాదించుకున్న అతి కొద్దిమంది దర్శకుల్లో విశ్వనాథ్ గారు కూడా నిలిచారు.