Love Reddy Review in Telugu: లవ్ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
October 18, 2024 / 09:18 AM IST
|Follow Us
|
Join Us
Cast & Crew
అంజన్ రామచంద్ర (Hero)
శ్రావణి రెడ్డి (Heroine)
ఎన్.టి.రామస్వామి, గణేష్ డి.ఎస్ (Cast)
స్మరణ రెడ్డి (Director)
సునంద బి.రెడ్డి - హేమలతా రెడ్డి - రవీంద్ర జి - మదన్ గోపాల్ రెడ్డి - నాగరాజు బీరప్ప - ప్రభంజన్ రెడ్డి - నవీన్ రెడ్డి (Producer)
ప్రిన్స్ హెన్రీ (Music)
మోహన్ చారి (Cinematography)
Release Date : అక్టోబర్ 18, 2024
ఈమధ్యకాలంలో మీడియం బడ్జెట్ సినిమాలు సైతం చేయలేకపోయిన స్థాయిలో హల్ చల్ చేసిన చిన్న బడ్జెట్ సినిమా “లవ్ రెడ్డి”. హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరూ కొత్తవాళ్లే. ఇంతమంది కొత్తవాళ్లు కలిసి చేసిన ప్రయత్నమే “లవ్ రెడ్డి”. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేస్తుండడంతో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. బజ్ కి తగ్గ స్థాయిలోనే సినిమా ఉందా? అనేది చూద్దాం..!!
Love Reddy Review
కథ: తన మనసుకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని 30 ఏళ్లు దాటినా కూడా సంబంధాలు రిజెక్ట్ చేసుకుంటూ కూర్చుంటాడు నారాయణ రెడ్డి (అంజన్ రామచంద్ర). అయితే.. బస్ లో చూసిన దివ్య (శ్రావణి రెడ్డి)నీ తొలిచూపులోనే ఇష్టపడి, ప్రేమించేస్తాడు. అయితే.. చాన్నాళ్లపాటు అది ఒన్ సైడ్ లవ్ స్టోరీగా మిగిలిపోతుంది.
నారాయణ రెడ్డిని లవ్ రెడ్డిగా మార్చిన దివ్య అతడి ప్రేమను అంగీకరించిందా? వీరి ప్రేమ సఫలమయ్యిందా? వంటి ప్రశ్నలకు సమాధానమే “లవ్ రెడ్డి” కథాంశం.
నటీనటుల పనితీరు: ముందు చెప్పినట్లుగా సినిమాలో నటించినవాళ్లందరూ కొత్తవాళ్లే. హీరో అంజన్ రామచంద్ర హావభావాల ప్రకటనలో కాస్త తడబడ్డాడు కానీ ఎమోషన్స్ విషయంలో మాత్రం మంచి పరిణితి కనబరిచాడు.
హీరోయిన్ గా కనిపించిన శ్రావణి రెడ్డి నిండైన చీరకట్టుతో తెరపై చాలా హుందాగా ఉంది. మంచి స్క్రీన్ ప్రెజన్స్ & ఎక్స్ ప్రెషన్స్ తో క్యారెక్టర్ కి న్యాయం చేసింది. క్లైమాక్స్ లో ఆమె నటన సినిమాకి మంచి ఎమోషన్ యాడ్ చేసి.. టాలెటెంట్ తెలుగు హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయింది.
వీళ్లిద్దరికంటే కన్నడ సీరియల్ యాక్టర్ అయిన ఎన్.టి.రామస్వామి తక్కువ స్క్రీన్ స్పేస్ లో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. సాడిస్టిక్ ఫాదర్ క్యారెక్టర్లో ఇరగ్గొట్టాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అతడి ఆటవిక చర్య ఒక చెరగని ముద్ర వేస్తుంది. కొన్ని సీన్స్ లో సీరియల్ యాక్టింగ్ చేసినా, క్లైమాక్స్ లో మాత్రం అందర్నీ డామినేట్ చేసేసాడు.
తమ్ముడి పాత్రలో గణేష్ డి.ఎస్ మంచి కామెడీతో నవ్వించాడు. మిగతా పాత్రధారులందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
సాంకేతికవర్గం పనితీరు: ప్రిన్స్ హెన్రీ సంగీతం ఈ సినిమాకి మెయిన్ హైలైట్. చాన్నాళ్ల తర్వాత ఓ చిన్న సినిమాలోని పాటల్లో సందర్భానుసారమైన సాహిత్యం వినిపించింది. అలాగే నేపథ్య సంగీతం కూడా బాగుంది.
ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ కి పెద్దగా స్కోప్ లేని సినిమా ఇది. ఊర్లో ఉన్న చిన్నపాటి లోకేషన్స్ లోనే సినిమాను చుట్టేశారు. అయితే.. అవన్నీ ఆర్గానిక్ గా ఉండడంతో పెద్దగా ఇబ్బందేమీ పెట్టలేదు.
సినిమాకి మెయిన్ మైనస్ గా నిలిచింది మాత్రం సినిమాటోగ్రఫీ వర్క్. సినిమా బడ్జెట్ తక్కువ అయినప్పటికీ.. కనీస స్థాయి కెమెరా వర్క్ కనిపించలేదు. కెమెరా వర్క్ & టింట్ కలర్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే.. సినిమా అవుట్ పుట్ కచ్చితంగా వేరే స్థాయిలో ఉండేది.
దర్శకుడు స్మరణ్ రెడ్డి ఒక సాధారణ కథను, ఆంధ్రా-కర్ణాటక బోర్డర్ నేటివిటీతో చాలా సహజంగా తెరకెక్కించిన విధానం ప్రశంసనీయం. మరీ ముఖ్యంగా సినిమాలో ఎలాంటి అసభ్యత, అశ్లీలత, ద్వంద్వార్థ సంభాషణలు లేకుండా స్వచ్ఛమైన సినిమాగా తెరకెక్కించిన విధానం కూడా బాగుంది. అయితే.. హీరో క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం, స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త నవ్యత చూపించి ఉంటే బాగుండేది. అలాగే.. హీరోహీరోయిన్ నడుమ కెమిస్ట్రీ అనేది ఇంకాస్త చక్కగా ఎస్టాబ్లిష్ చేసి ఉండొచ్చు. ఈ చిన్నపాటి మైనస్ ల కారణంగా భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన క్లైమాక్స్ సీక్వెన్స్ ఓ హృద్యమైన సన్నివేశంగా మిగిలిపోయింది.
అయితే.. ఓ కథకుడిగా, దర్శకుడిగా స్మరణ్ రెడ్డి మంచి మార్కులు సంపాదించుకున్నాడని చెప్పాలి. మంచి బడ్జెట్ & టెక్నికల్ సపోర్ట్ దొరికితే తన సత్తా చాటుకోగలడు అనిపించింది.
విశ్లేషణ: కంటెంట్ ఉన్న సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. “లవ్ రెడ్డి” మంచి కంటెంట్ ఉన్న సినిమా, అయితే.. టెక్నికల్ గా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. కానీ.. చిత్రబృందం ఎంతో నిజాయితీగా సినిమాను ప్రొజెక్ట్ చేసిన విధానం ముందు ఆ మైనస్ లు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇదే కథ గనుక మంచి కెమెరా వర్క్ & డి.ఐతో వచ్చి ఉంటే “అనంతరపురం 1980” స్థాయి విజయాన్ని అందుకొని ఉండేది. అయినప్పటికీ.. తక్కువ టికెట్ రేట్ కి అందుబాటులో ఈ చిన్న సినిమాను ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది.
ఫోకస్ పాయింట్: రెడ్డిగారి హృద్యమైన వీరప్రేమగాథ!
రేటింగ్: 2/5
Rating
2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus