ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ (Rajinikanth) – యువ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. దానిని ఫస్ట్ లుక్ అనేకంటే కాన్సెప్ట్ పోస్టర్ అంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఆ సినిమాలో పోస్టర్‌లో టైటిల్ లేదు.. కానీ సినిమా అంతా బంగారం చుట్టూ తిరుగుతుంది అని చెప్పకనే చెప్పేశారు. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఆసక్తికర రూమర్లు బయటకు వచ్చాయి. అయితే పూర్తి వివరాలు ఈనెల 22న ప్రకటిస్తామని చెప్పారు.
ఈ నేపథ్యంలో సినిమా గురించి ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. అదే ఈ సినిమా పేరు. ఈ సినిమా కోసం తమిళంలో ‘కళుగు’ అనే పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ‘కళుగు’ అంటే తెలుగులో ‘డేగ’ అని అర్థం. రజనీకాంత్ పాత్ర తీరు తెన్నుల్ని దృష్టిలో పెట్టుకుని చిత్ర బృందం ఆ పేరును పరిశీలిస్తోందని, దాదాపు అదే పేరు ఖరారు చేస్తారని అంటున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ బంగారు స్మగ్లర్‌గా కనిపిస్తాడని.. కాస్త నెగిటివ్ షేడ్ కూడా ఉంటుంది అని అంటున్నారు. నెగిటివ్ షేడ్ విషయం అయితే లోకేశే చెప్పేశారు.
లోకేశ్ కనగరాజ్ ఇటీవలి సినిమాలన్నీ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంటాయి. ఆ దందాలోనే హీరో ఉంటాడు, విలనూ ఉంటాడు. ఈ మొత్తం ప్రపంచాన్ని లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ అనే పేరుతో పిలుస్తున్నారు. అయితే ఇన్నాళ్లూ మాదకద్రవ్యాల సినిమాలు చేసిన లోకేశ్ ఇప్పుడు బంగారం వైపు ఎందుకొచ్చారు అనేది ఇక్కడ. దీంతో #తలైవా171 లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఉంటుందా? ఉండదా? అంటూ ఓ చర్చ మొదలైంది. దీనిపై 22నే క్లారిటీ వస్తుంది అని కూడా చెబుతున్నారు.
ఇక ఈ సినిమా 2013లో వచ్చిన ‘ది పర్జ్’ ఆధారంగా సిద్ధంగా చేస్తున్నట్లు టాక్. అమెరికన్ ప్రభుత్వం ఓ 12 గంటల పాటు విచిత్రమైన జీవో అమలు చేస్తుంది. ఆ సమయంలో ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీ చేసినా చర్యలు ఉండవు. ఫోన్ చేసినా పోలీసులు రారు. హాస్పిటల్స్‌కి కాల్ చేసినా ఆంబులెన్స్ రావు. ఇలాంటి పరిస్థితుల్లో హీరో తన కుటుంబాన్ని, ఆపదలో ఉన్న తన వాళ్లను ఎలా కాపాడుకున్నాడు అనేదే ఆ సినిమా పాయింట్. ‘ఖైదీ’ సినిమా తరహాలో కేవలం ఒక్క రాత్రిలో జరిగే సంఘటనలతో ఈ సినిమా ఉంటుందని, మన నేటివిటీకి తగ్గట్టు లోకేశ్ మార్పులు చేస్తున్నారని చెబుతున్నారు.