చిరంజీవితో (Chiranjeevi) సినిమా అంటే భారీ చిత్రం అనే ట్యాగ్ లైన్ ఎలా వస్తుందో.. పక్కాగా, పద్ధతిగా, అనుకున్న సమయానికి పూర్తి చేయాలనే డెడ్‌లైన్, రూల్స్ కూడా వస్తాయి. అలా అని చెప్పి అవి గొంతెమ్మ కోరికలో, ఎక్కడా జరగని విషయాలో కావు. సగటు సినిమాకు ఉండే అలిఖిత నియమాలే. ఈ విషయాన్ని ‘విశ్వంభర’ (Vishwambhara) దర్శకుడు మల్లిడి వశిష్ఠ పక్కాగా పాటించి, ప్లానింగ్ ప్రకారం ముందుకు తీసుకెళ్తున్నారు అని అంటున్నారు. చిరంజీవి కథానాయకుడిగా మల్లిడి వశిష్ఠ (Mallidi Vasishta) తెరకెక్కిస్తున్న సినిమా ‘విశ్వంభర’.
త్రిష (Trisha) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) మరో కీలక పాత్రధారి. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తవ్వగా, ఇప్పుడు సంగీత చర్చలు, పనులు శరవేగంగా జరుగుతున్నాయట. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్, మూడు పాటల్ని షూట్ చేయాల్సి ఉందట. దీని కోసం ఆగస్టు తొలి వారంలో హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తారట. ఈ క్రమంలో ప్రత్యేక సెట్లు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
చిరంజీవి పరిచయ గీతం తొలుత ఆ సెట్స్‌లో చిత్రీకరిస్తారట. ఆ తర్వాత యాక్షన్ కొరియోగ్రాఫర్ల ద్వయం అనల్ అరసు నేతృత్వంలో క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరించే ఏర్పాట్లు జరుగుతున్నాయట. అలా మొత్తంగా ఆగస్టు నెలాఖరుకు సినిమా షూటింగ్ ముగించాలని వశిష్ట ప్రణాళికలు గీస్తున్నారట. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 10న థియేటర్లలో రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. సమయం కాస్త ఎక్కువ ఉన్నా.. ఎలాంటి కంగారు లేకుండా చాలా ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలని చిరంజీవి ముందు నుండి అంటున్నారట.
ఈ క్రమంలోనే వశిష్ట ప్లాన్స్ వేస్తున్నారట. ఈ విషయంలో చిరంజీవి ‘వెల్‌డన్’ అన్నారని టాక్. ఇక ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్‌ను రిలీజ్ చేస్తారని వార్తలొస్తున్నాయి. అయితే అది గ్లింప్స్ తరహాలోనే ఉంటుందని చెబుతున్నారు. సినిమా రిలీజ్‌కు ముందు టీజర్, ట్రైలర్ వస్తాయట. లక్ష్యం కోసం వివిధ లోకాల్లో సాహస యాత్ర చేసే భీమవరం దొరబాబు అనే పాత్రలో చిరంజీవి ఈ సినిమాలో కనిపిస్తారట.