ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున తన అభిమానికి క్షమాపణలు చెప్పాడు. ఇటీవల జరిగిన ఓ ఘటన కారణంగా నాగార్జున సారీ చెప్పాల్సి వచ్చింది. అయితే ఆ ఘటనకు ఆయన కారణం కాకపోయినా.. ఆయన సిబ్బంది కారణమవ్వడం గమనార్హం. నాగార్జున ఇటీవల ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ కోసం నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో.. ఓ అభిమాని సెల్ఫీ దిగడానికి ప్రయత్నించారు. అయితే పక్కనే ఉన్న నాగ్ బాడీ గార్డు ఆ అభిమానిని పక్కకు నెట్టేశారు. దీనికి సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇప్పుడే ఆ వీడియో నా దృష్టికి వచ్చింది. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. నేను ఆ పెద్దాయనకు క్షమాపణలు చెబుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్త తీసుకుంటాను. అని నాగార్జున ఆ వీడియోను కోట్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనికి నాగ్‌కు అభిమానుల నుండి ధన్యవాదాల వర్షం కురుస్తోంది. మీరు చూపించిన గౌరవానికి అభినందనలు అని కామెంట్స్ చేస్తున్నారు. అక్కడ తప్పు బౌన్సర్‌ది. కానీ మీరు క్షమాపణలు చెప్పారు అని కామెంట్ చేస్తున్నారు.
ఇంతకీ ఏమైందంటే.. నాగర్జునను చూసి ఎయిర్‌పోర్టు సిబ్బందిలో ఒక పెద్దాయన నాగ్ వైపునకు వచ్చారు. అయితే మరీ మరింత దగ్గరకు రావడంతో పక్కనే ఉన్న నాగ్ బాడిగార్డ్ పెద్దాయనను పక్కకు నెట్టేశారు. దీంతో ఆయన అదుపు తప్పి కింద పడబోయాడు. అయితే ఇంతలోనే బ్యాలెన్స్ చేసుకుని నిలబడ్డారు. ఈ వీడియో అటు తిరిగి, ఇటు తిరిగి నాగ్ వరకు వెళ్లింది. దీంతో ఆయన స్పందించి సారీ చెప్పారు.
అయితే, నేరుగా తెలిసి అభిమానులకు చెంపదెబ్బలు గిఫ్ట్‌గా ఇచ్చే హీరోలు ఉన్న మన ఇండస్ట్రీలో తనకు ఏ మాత్రం తెలియని ఘటన గురించి సారీ చెప్పిన నాగ్ లాంటి హీరో ఉండటం గొప్ప విషయమే అని చెప్పాలి. ఆ పెద్దాయన ఎవరో తెలుసుకుని ఈసారి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లినప్పుడు ఆయనతో ఓ సెల్ఫీ దిగి నాగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే భలే ఉంటుంది కదా. ఈ విషయం కూడా ఎవరైనా నాగ్ వరకు పంపిస్తే బాగుండు.