“అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి” వంటి ఆధ్యాత్మిక చిత్రాలతో మంచి హిట్స్ సొంతం చేసుకొన్న నాగార్జున ఆ తర్వాత “ఓం నమో వెంకటేశాయా” చిత్రంతో మరో డివోషనల్ హిట్ అందుకోవాలని ప్రయత్నించాడు. అయితే.. అప్పటికే మాస్ మసాలా సినిమాలకు బాగా అలవాటుపడిపోయిన ప్రేక్షకుడు ఆధ్యాత్మిక చిత్రమైన “ఓం నమో వెంకటేశాయ” చిత్రాన్ని సరిగా ఆదరించలేదు. దాంతో నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది ఆ చిత్రం. నాగార్జునతోపాటు అనుష్క కూడా కీలకపాత్ర పోషించిన ఈ చిత్రం ఇప్పుడు తమిళంలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఇటీవల అనుష్క నటించిన “భాగమతి” చిత్రం తమిళంలోనూ ఘన విజయం సొంతం చేసుకొని ఉండడంతో.. ఆమె క్రేజ్ ను క్యాష్ చేసుకొనేందుకు ఈ శుక్రవారం (ఫిబ్రవరి 23) “ఓం నమో వెంకటేశాయ” చిత్రాన్ని తమిళంలో “బ్రహ్మాండ నాయగన్” అనే పేరుతో విడుదలవుతోంది. ప్రగ్యా జైస్వాల్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించి ఉండడం విశేషం. మరి తెలుగులో డిజాస్టర్ గా నిలిచిన ఈ చిత్రం తమిళనాట ఏమేరకు విజయం సాధిస్తుందో చూడాలి.
ఇకపోతే.. నాగార్జున తాజాగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని కూడా తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.