సినిమా ప్రమోషన్ విషయంలో నాని (Nani) ఎప్పుడూ కష్టపడేవాడు. తాజాగా తన కొత్త సినిమా ది ప్యారడైజ్ కోసం కూడా అదే చేస్తుండటం విశేషం. దసరా తర్వాత నాని మరో మాస్ అప్పీల్ కలిగిన చిత్రానికి ఓకే చెప్పడం ఆసక్తిగా మారింది. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అయితే నాని ఈసారి 300 కోట్లకు టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ది ప్యారడైజ్ కోసం మేకర్స్ గ్లింప్స్‌ను రెడీ చేస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్‌ను మార్చి 3న రిలీజ్ చేయనున్నారు.
అయితే ఇది ఏకంగా 8 భాషల్లో విడుదల కానుందట. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, స్పానిష్‌తో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఇక విశేషం ఏమిటంటే, స్పెయిన్‌లో రిలీజ్ అవుతున్న తొలి తెలుగు సినిమా ఇదేనట. స్పెయిన్‌లో నాని సినిమాలు కొంతమంది చూసినా, ఓ తెలుగు సినిమా అక్కడ ప్రత్యేకంగా రిలీజ్ కావడం ఇదే తొలిసారి. అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించి స్వయంగా నాని స్పానిష్‌లో డబ్బింగ్ చెప్పనున్నట్లు సమాచారం. ఇది నానికి మరో కొత్త అనుభవంగా మారబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకుముందు ఏ తెలుగు హీరో తన సినిమా కోసం విదేశీ భాషలో డబ్బింగ్ చెప్పిన రికార్డు లేదు.
నాని ఈ ప్రయోగాన్ని ఎందుకు చేస్తున్నాడంటే, తెలుగు సినిమాల మార్కెట్‌ను కొత్త దేశాల్లో విస్తరించాలనే ఆలోచనతోనే. సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) ప్రమోషన్ సమయంలో కూడా నాని ఇతర భాషల్లో సైతం సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని చెప్పాడు. ఇప్పుడు అదే ది ప్యారడైజ్ ద్వారా చేసి చూపిస్తున్నాడు. అంతే కాకుండా నాని దసరా (Dasara) సినిమాతో ఫస్ట్ టైమ్ 100 కోట్లను దాటాడు. ఇక ప్యారడైజ్ క్లిక్కయితే 250 కోట్లు దాటి 300 కోట్ల మార్క్ ను టచ్ చేయగలడు అనే నమ్మకంతో ఉన్నారట.
హిందీలో కూడా ప్రమోషన్ డోస్ పెంచాలని చూస్తున్నారు. దేవర (Devara), పుష్ప 2 (Pushpa 2) ఇచ్చిన సపోర్ట్ తో నార్త్ బెల్డ్ లో 70 నుంచి 100 కోట్ల మధ్యలో టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ గా వరల్డ్ వైడ్ 300 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి నాని క్రేజ్ ఆ స్థాయిలో క్లిక్కవుతుందో లేదో చూడాలి. ఈ సినిమా మరింత ఇంటెన్స్‌గా ఉంటుందని ఇప్పటికే సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రా స్టేట్‌మెంట్ పేరుతో వచ్చే ఈ గ్లింప్స్ ద్వారా మూవీ ఎలాంటి ఫీల్ ఇస్తుందో చూడాలి.