సినిమా కచ్చితంగా ఆడుతుందనే నమ్మకంతోనే దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తారు. కానీ స్క్రిప్ట్ బలంగా లేనప్పుడు ప్రేక్షకులు సినిమాని పట్టించుకోరు. ఇప్పుడు రణవీర్ సింగ్ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. లాక్ డౌన్ తరువాత చెప్పుకోదగ్గ మొదటి సక్సెస్ గా నిలిచిన ‘సూర్యవంశీ’ దర్శకుడు రోహిత్ శెట్టి ‘సర్కస్’ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా బుకింగ్స్ దారుణంగా ఉన్నాయి. దీంతో మొదటిరోజు కేవలం మూడు కోట్లు మాత్రమే వసూలు చేసింది.
రిలీజ్ కు ముందు కాస్త బజ్ రావడంతో సినిమాపై నమ్మకంతో థియేటర్ కు వెళ్లినవారికి చుక్కలు కనిపించాయి. రణవీర్ సింగ్ డ్యూయల్ రోల్ పెర్ఫార్మన్స్.. ఒక పాత్ర చేసే ఓవరాక్షన్ చూడలేక జనాలు ఇబ్బంది పడ్డారు. అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సౌత్ సినిమాలను కాపీ కొడుతూ రీమేక్ లు చేసుకునే రోహిత్ శెట్టి మళ్లీ పాత రొటీన్ మసాలానే నమ్ముకొని ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టారు.
చెత్త జోకులతో ప్రతి ఆర్టిస్ట్ పోటీ పడుతూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ తో రెండున్నర గంటలు థియేటర్లో కూర్చోవడం ప్రేక్షకులు కష్టంగా ఫీల్ అయ్యారు. అసలు కథలో విషయం ఉంటేనే కాస్త ఏదైనా పాజిటివ్ గా చెప్పుకోవడానికి. హీరోతో పాటు సైడ్ రోల్ తో కూడా ద్విపాత్రాభినయం చేయించి కన్ఫ్యుజింగ్ డ్రామా తీశారు. సినిమాలో ఏ ఒక్క విభాగంతో కూడా కనీసం ఏవరేజ్ అవుట్ పుట్ రాబట్టుకోలేకపోయారు.
బయట ఇంటర్వ్యూలలో మాస్ పల్స్ తెలిసిన వ్యక్తిగా చెప్పుకునే రోహిత్ శెట్టి ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ పై ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజాహెగ్డే పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. బాలీవుడ్ లో రాణించాలనే కోరికతో ఉన్న పూజా ఇలాంటి ప్రాధాన్యం లేని పాత్రలను ఎన్నుకోవడం ఏంటో!