పవన్ కల్యాణ్(Pawan Kalyan) సినిమాకు బిజినెస్ విషయంలో ఇన్నేళ్లలో ఎప్పుడూ సమస్య రాలేదు. ఆయనకు ఉన్న ఇమేజ్, గత సినిమా ఫలితం మీద ఆధారపడనక్కర్లేదు అనే ధైర్యం ఆయన సినిమాలకు భారీ ధరను అందిస్తూ వచ్చాయి. అయితే తొలిసారి ఆయన కెరీర్‌లో సినిమా బిజినెస్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు అని తెలుస్తోంది. అయితే ఆ ఇబ్బంది ఎవరూ సినిమాను తీసుకోక కాదు.. సినిమా కోసం ఎక్కువ మంది ముందుకు రావడం అని అంటున్నారు.
OG Movie
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఈ క్రమంలో ఆయన సినిమాల విడుదలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని తేలిపోయింది. ఎందుకంటే గత ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పవన్ సినిమాల మీద కక్ష గట్టింది. సినిమా టికెట్ ధరల, పర్మిషన్లు, థియేటర్ల దగ్గర పహారాలు, అభిమానులకు ఆంక్షలు.. ఇలా ఒక్కటా రెండా రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. అంత కష్టంలోనూ జనాలు వచ్చారు.
ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు.. అలాగే సినిమా గురించి వస్తున్న బజ్ చూసి ఈసారి కౌంట్ గట్టిగానే ఉంటుంది అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ క్రమంలో పంపిణీదారులు, థియేటర్ల ఓనర్లు పెద్ద మొత్తంలో పెట్టుకుని ‘ఓజీ’ (OG Movie) సినిమాను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో నిర్మాత డీవీవీ దానయ్యకు (D. V. V. Danayya)ఇప్పటికే రూ.250 కోట్ల వరకు చేతికొస్తాయి అని లెక్క కడుతున్నారు. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల ద్వారానే ఏకంగా రూ. 110 కోట్లు – రూ. 130 కోట్లు వచ్చాయి అని టాక్.
ఆంధ్రప్రదేశ్ థియేట్రికల్ రైట్స్ రూ.70 కోట్లు – రూ. 80 కోట్లు ఉండగా, తెలంగాణ నుండి రూ. 40 కోట్లు – రూ. 50 కోట్లు చేసినట్లుగా సమాచారం అందుతోంది. అయితే మొత్తంగా ఒక నిర్మాణ / పంపిణీ సంస్థకే దక్కింది అని అంటున్నారు. ఇటీవల ఆ నిర్మాణ సంస్థ ఇలానే ఓ పెద్ద సినిమాను గంపగుత్తగా రిలీజ్ చేసింది అని తెలుస్తోంది. ఇక మిగిలిన రైట్స్, ఓవర్సీస్ ద్వారా మరో రూ. 150 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు.