రవితేజ హీరోగా పికప్ అయినప్పటి నుండి ఓ హిట్ ఇస్తే…. రెండు ప్లాపులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అలా అని రవితేజ పారితోషికం విషయంలో తగ్గింది లేదు. తగ్గుతుంది కూడా లేదు అనే చెప్పాలి. గతేడాది చూసుకుంటే.. రవితేజ ‘ఖిలాడి’ ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి రెండు డిజాస్టర్లు ఇచ్చాడు. అయితే ‘ధమాకా’ అతను కూడా ఊహించని విధంగా హిట్ అయ్యింది. మిక్స్డ్ టాక్ వచ్చినా ఆ సినిమా హిట్ అవ్వడానికి కారణం…
కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ అలాగే.. పాటలు మంచి హిట్ అవ్వడం అనే చెప్పాలి. ఆ సినిమాతో (Ravi Teja ) రవితేజ సోలోగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకున్నాడు. అటు తర్వాత చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో కీలక పాత్ర పోషించి రూ.200 కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయాడు. అయితే ఇటీవల వచ్చిన ‘రావణాసుర’ సినిమా ప్లాప్ అయ్యింది. అయితే ఆ సినిమా వల్ల నిర్మాతలకు కానీ బయ్యర్స్ కి కానీ ఎటువంటి నష్టం రాలేదు అని సమాచారం.
అలా అని ఆ మూవీని సక్సెస్ అనలేం. అయితే ‘రావణాసుర’ ఫలితం తేడా కొట్టినా.. తన నెక్స్ట్ సినిమాకి ఏకంగా రూ.25 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడట రవితేజ. నిర్మాతలు కూడా అతని డిమాండ్ కు అడ్డు చెప్పకుండా ఓకే చెప్పేస్తున్నట్టు వినికిడి. ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ తో రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో శర్వానంద్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసమే రవితేజ రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది.