కొద్దిరోజుల క్రితం నాగబాబు ఓ ట్వీట్ చేసి ఇరుకున్న పడ్డాడు. ఆయన గాంధీని చంపిన గాడ్సే కూడా మంచివాడే, ఆనాటి మీడియా ఆయన్ని చెడ్డవాడిగా చిత్రీకరించింది అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ అనేక మంది మనోభావాలను దెబ్బతీసింది. దీనితో కొందరు ఆయనపై కేసులుపెట్టగా, మరికొందరు సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు వేశారు. దాని వలన సొంత కుటుంబంలోనే ఆయనపై వ్యతిరేకత రావడంతో నాలుక కరుచుకొని, అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే జనసేన పార్టీకి, నా కుటుంబానికి సంబంధం లేదని సంజాయిషీ ఇచ్చుకున్నారు.
తాజాగా ఆయన మరో రెండు ట్వీట్స్ గాంధీజీని ఉద్దేశించి వేశారు. ”ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది.ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ”. ”గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు.దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు.భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది”.
ఈ రెండు ట్వీట్స్ సారాంశం ఏమిటంటే గాంధీ ఒక్కడే దేశ భక్తుడు కాదు, చాల మంది దేశం కోసం ప్రాణాలు అర్పించారు, మరి వారికి గుర్తింపు ఏది అని ప్రశ్నిస్తున్నట్లు ఉంది. ఐతే నాగబాబు చేస్తున్న ఈ ట్విట్టర్ పోరాటం ఎవరిపై అనేదే అసలు సమస్య. ప్రస్తుతం కేంద్రములో అధికారంలో ఉన్న బీజేపీ మీదనా, లేక స్థానిక ప్రభుత్వాల మీదనా?. ఒక వేళా ఈ విషయాన్ని గట్టిగా ముందుకు తీసుకు వెళ్ళాలి అనుకుంటే ఆయన నేరుగా మోడీని కలవవచ్చు కదా. ఆయనకు అంత ప్రాధాన్యం లేకపోతే ఆ పార్టీతో దోస్తీ చేస్తున్న పవన్ కళ్యాణ్ తో అడిగించవచ్చు కదా. అలా కాకుండా ఈ కాలక్షేపం ట్వీట్లతో నాగబాబుకి ఒరిగేదేమిటి…పబ్లిసిటీ తప్ప.