రాఘవ లారెన్స్ (Raghava Lawrence) కాంచన సిరీస్ అంటే తెలుగులోనూ, తమిళంలోనూ ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హారర్, కామెడీగా రూపొందిన ఈ సిరీస్‌కి విపరీతమైన ఫ్యాన్‌బేస్ ఉంది. ఇప్పటి వరకు మూడు భాగాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన లారెన్స్, ఇప్పుడు కాంచన 4 ను రూపొందిస్తున్నాడు. అయితే ఈ సారి లారెన్స్ పూజా హెగ్డే పాత్రతో ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇవ్వబోతున్నట్లు టాక్. పూజా హెగ్డే (Pooja Hegde) అంటేనే గ్లామర్ రోల్స్‌తో హైలెట్ అవుతుంది.
డీజే (Duvvada Jagannadham) , అల.. వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo) , రాధే శ్యామ్ (Radhe Shyam) వంటి సినిమాల్లో తన గ్లామర్ షోతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు కాంచన 4లో ఆమె పాత్ర ఊహించని కోణంలో సాగుతుందని వార్తలు వస్తున్నాయి. సౌత్ సినిమాల్లో గ్లామర్ పాత్రలే చేయడం వల్ల ఆమెకు వేరే రకాల పాత్రల అవకాశాలు పెద్దగా రాలేదు. దీంతో కొంతకాలంగా ఆమె కెరీర్ నిరాశాజనకంగా మారింది. ఇప్పుడు లారెన్స్ మాత్రం ఈ బుట్టబోమ్మను పూర్తిగా డీ గ్లామరైజ్ చేయనున్నాడట.
కాంచన 4 లో చెవిటి-మూగ అమ్మాయిగా పూజా హెగ్డే కనిపించబోతుందని, ఆ పాత్రకు భారీ ఎమోషనల్ ఎలివేషన్ ఉంటుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పూజా హెగ్డేలాంటి గ్లామర్ డాల్‌ను పూర్తిగా డీ గ్లామర్‌గా చూపించడమే కాదు, డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చి కొత్త కోణంలో ప్రేక్షకుల ముందుకు తేవడం నిజంగా పెద్ద రిస్క్ అని అంటున్నారు. ఇంతకుముందు కాంచన 3 లో నిత్యా మీనన్‌ను (Nithya Menen) కూడా లారెన్స్ డీ గ్లామర్ లుక్‌లో చూపించాడు. కానీ ఆమె బాగా పెర్ఫార్మ్ చేయడంతో ఆ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.
ఇప్పుడు అదే తరహాలో పూజా హెగ్డేపై (Pooja Hegde) నమ్మకముంచి లారెన్స్ ప్రయోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రేక్షకులు ఆమెను ఆ పాత్రలో అంగీకరిస్తారా లేక అలవాటు అయిన గ్లామర్ లుక్‌నే కోరుకుంటారా అనేది పెద్ద ప్రశ్న. ఇంతకుముందు పూజా హెగ్డే నటనకు సీరియస్ రోల్స్‌లో పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఈ సారి లారెన్స్ కథ, దర్శకత్వం, కాంచన సిరీస్ ఫాంలో ఉండటంతో ఆమె ఈ ఛాలెంజ్‌ను విజయవంతంగా నెరవేర్చుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. కాంచన 4 లో ఈ ప్రయోగం ఎంతవరకు క్లిక్ అవుతుందో వేచి చూడాలి.