టీమ్ అయితే లెక్క పక్కాగా చెప్పడం లేదు కానీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాకు భారీగానే ఖర్చు పెట్టారు. ఈ సినిమాకు రూ.600 కోట్లకుపైగా బడ్జెట్ అయి ఉంటుంది అని ఓ అంచనా. నిజంగా ఎంత పెట్టారు అనేది తెలియదు టీమ్ చెప్పడం లేదు కానీ.. ఎందుకు అంత పెట్టారు అనేది మాత్రం నిర్మాత అశ్వనీదత్ ఇటీవల చెప్పుకొచ్చారు. అంతేకాదు వైజయంతీ మూవీస్ బ్యానర్ స్థాపించి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ సినిమా చేయాలని అనుకోలేదని కూడా చెప్పారు.
పురాణ పాత్రలు, సైన్స్ ఫిక్షన్‌ను కలుపుతూ దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పకడ్బందీగా కథను సిద్ధం చేశారని చెప్పిన అశ్వనీదత్ (C. Aswani Dutt).. సినిమా అంత మొత్తంలో ఖర్చు పెట్టడానికి కారణం ప్రభాస్ (Prabhas) , కమల్ (Kamal Haasan) , అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అని తేల్చేశారు. వాళ్లు ఉన్నారనే ధైర్యంతోనే సినిమాకు అంత మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టామని, ఇప్పుడు మా నమ్మకం నిజమై వందల కోట్ల రూపాయల వసూళ్లు వస్తున్నాయని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వాలు ఇవ్వడం మంచి నిర్ణయమని చెప్పిన అశ్వనీదత్.. ఈ పెంపు వల్ల బ్లాక్ టికెటింగ్ తగ్గుతుందని తద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు మంచే జరుగుతుంది అని చెప్పారు. అయితే కొంతమంది మాత్రం ‘టికెట్ రేట్లు పెంచి నిర్మాతలు దండుకుంటున్నారు’ అని ఆరోపణలు చేస్తున్నారని అశ్వనీదత్ అన్నారు. అలాంటి ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు. వారం తర్వాత టికెట్ ధరలు సాధారణమైపోతాయని కూడా అన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని నాశనం చేశారని, ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యారు కాబట్టి.. రాష్ట్రంతో పాటు, సినీ పరిశ్రమ కూడా బాగుపడుతుంది అని చెప్పారు. మరి పదవులు ఏమన్నా ఆశిస్తున్నారా అంటే.. తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదు అని స్పష్టం చేశారు.