టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju) ట్రోలింగ్ బారిన పడ్డారు. అందుకు కారణం ఏంటంటే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఈ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలకి కోపాన్ని తెప్పించాయని కొంతమంది నెటిజన్లు ఆరోపిస్తున్నారు. దిల్ రాజు తన స్పీచ్లో భాగంగా… ‘ ఆంధ్ర ప్రజలు సినిమా అనగానే ఒక వైబ్ తో థియేటర్ కి వస్తారని.. కానీ తెలంగాణ ప్రజలు సినిమాల కంటే ‘కల్లు, మటన్’కే ఎక్కువ వైబ్ ఇస్తారని’ కామెంట్స్ చేశారు.
ఇవి కొంతమంది తెలంగాణ నెటిజన్లకు నచ్చలేదు. నిజామాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో దిల్ రాజు మాట్లాడుతూ… “తెలంగాణలో సినిమాలకు ఆదరణ తక్కువగా ఉంటుందని, ఇక్కడి ప్రజలు తెల్ల కల్లు, మటన్ వంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమాలకు ఉన్న ఆదరణ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు దిల్ రాజుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
దిల్ రాజు వ్యాఖ్యలు తెలంగాణ సంస్కృతిని, ప్రజల అభిరుచులను కించపరిచేలా ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ (Shirish) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాపై మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో దిల్ రాజు తెలంగాణ సినీ ప్రేక్షకులపై చేసిన ఈ కామెంట్స్ సినిమాపై ఏమైనా ప్రభావం చూపిస్తాయా? అనేది తెలియాల్సి ఉంది.