జీవితాన్ని రెండు ముక్కల్లో చెప్పాలంటే పూరి జగన్నాథ్ సినిమాలు చూడాలి. అదే కాస్త లెంగ్తీగా తెలుసుకోవాలంటే ఆయన మ్యూజింగ్స్ వినాలి. గతేడాది కరోనా తొలి వేవ్ సమయంలో లైఫ్ లెసన్స్‌ను పూరి మ్యూజింగ్స్ పేరుతో విడుదల చేయడం స్టార్ట్ చేశారాయన. ఇటీవల రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా తాజాగా సాయం చేయడం గురించి ఆస్తక్తికరం వివరించారు. ఏదైనా పని చేసేటప్పుడు, ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు ఎందుకైనా మంచిదని పెద్దవాళ్ల దీవెనలు తీసుకుంటుంటారు.
ఏ దేవుడి ఫొటో చూసినా మనల్ని ఆశీర్వదిస్తున్నట్లే ఉంటుంది. అందరి దీవెనలూ తీసుకుని జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోవాలని అనుకుంటాం. అలాంటి ఆశీస్సుల కోసం మనం ఎక్కడికైనా, ఎంత దూరమైనా వెళ్తాం. అదే పెద్ద సమస్య. నిజానికి ఒకరి దీవెనల వల్ల మన సమస్యలేమీ తీరిపోవు. మనకు ఆశలు ఎక్కువ కాబట్టి అన్నీ నమ్ముతాం. మన ఏడుపులు ఏ దేవుడూ వినడు అంటూ ఆశీస్సులు గురించి చెప్పారు పూరి. అంతేకాదు దేవుడు మనల్ని ప్రేమించడు, ద్వేషించడు, పట్టించుకోడు.
అందర్నీ దీవించుకుంటూ బతకడం దేవుడి పనికాదు కదా. నీ మాతృమూర్తి దీవెన కంటే మిగిలినవేవీ గొప్పవి కాదు. పిల్లలు గొప్పవాళ్లు కావాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. వాటిని నిజం చేయాల్సింది మనమే. నిజమైన దీవెనలంటే జ్ఞానాన్ని పంచడం, సేవ చేయడం. నువ్వు దాహంతో ఉన్నప్పుడు ఎవరైనా మంచినీళ్లు తెచ్చిస్తే అతనే మన దేవుడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సాయం చేస్తే అతనే దేవుడు. ఎందుకంటే, సాయం చేయడమే నిజమైన దీవెన అని పూరి మ్యూజింగ్ పూర్తి చేశారు.