అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar). కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప 2: ది రూల్ (Pushpa 2 The Rule) బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టిస్తోంది. సినిమా విడుదలైనప్పటి నుంచి కలెక్షన్ల పరంగా అదిరిపోయే దూకుడు చూపిస్తూ, పాన్ ఇండియా స్థాయిలో ఓ భారీ హిట్‌గా నిలిచింది. ఇప్పటివరకు రూ.1400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, టాలీవుడ్ చరిత్రలో కొత్త పేజీని తెరిచింది. అయితే నెంబర్ వన్ రికార్డ్ అందుకోవాలి అంటే ఇంకా మరికొన్ని రోజులు కొనసాగాలి.
Pushpa 2
టాలీవుడ్ టాప్ మూవీ బాహుబలి 2 (Baahubali 2) రికార్డును అందుకోవాలంటే పుష్ప 2 కి (Pushpa 2) ఇంకా రూ.450 కోట్లు అవసరం. ఇది సాధ్యం కావాలంటే వచ్చే క్రిస్మస్ సీజన్ వరకు థియేటర్లలో నిలవడం కీలకమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి వసూళ్లు కాస్త తగ్గినప్పటికీ, నార్త్ ఇండియాలో మాత్రం పుష్ప 2 మరింత పుంజుకుంటూ ఉంది. రెండో సోమవారం ఏకంగా రూ.25 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. రెండో వీకెండ్‌లోనూ వంద కోట్లు దాటే వసూళ్లను నమోదు చేయడం ఈ సినిమా బలాన్ని చాటుతోంది.
ఇప్పుడు మూడో వారంలో కూడా అదే జోరు కొనసాగితే, నార్త్ బాక్సాఫీస్ వద్ద మరో వంద కోట్ల మార్క్‌ను అందుకునే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా క్రిస్మస్ పండగ సీజన్ పుష్ప 2కు చాలా కీలకమని భావిస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు మలయాళం మార్కెట్‌లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించినప్పటికీ, మరింత వసూళ్లను రాబట్టాలంటే పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మలయాళ ఇండస్ట్రీలో క్రిస్మస్‌కు పలు కొత్త చిత్రాలు విడుదల కానున్నాయి.
ఈ పరిస్థితుల్లో అక్కడి ప్రేక్షకులు పుష్ప 2ను మరింత సపోర్ట్ చేస్తారా లేదా అనేది సందేహంగా మారింది. అయినా నార్త్‌లో మాత్రం పరిస్థితి అనుకూలంగా ఉందని డిస్ట్రిబ్యూటర్లు నమ్ముతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పోల్చితే హిందీ మార్కెట్ నుంచి వచ్చే వసూళ్లు ఇప్పుడు సగానికి డబుల్‌గా నమోదవుతున్నాయి. ఈ స్థాయిలో మరో రెండు వారాలు సినిమాకు సపోర్ట్ ఉంటే, 2024 క్రిస్మస్ వరకు పుష్ప 2 సక్సెస్ రన్ కొనసాగుతూ బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసే అవకాశం లేకపోలేదని ట్రేడ్ విశ్లేషకులు ధీమాగా చెబుతున్నారు.