యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రాధే శ్యామ్’. ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘గోపికృష్ణా మూవీస్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 జనవరి సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రోమోలు, పాటలు వంటివి సినిమా పై భారీ అంచనాలు నమోదయ్యేలా చేసాయి.
మరీ ముఖ్యంగా విక్రమాదిత్య ఇంట్రో టీజర్ మరియు ఈ రాతలే పాట.. సినిమా పై అప్పటివరకు ఉన్న అంచనాలను డబుల్ చేశాయనే చెప్పాలి. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం విడుదల కాబోతుంది. అయితే తెలుగు ప్రేక్షకుల తర్వాత ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నది నార్త్ ఆడియెన్స్ అనే చెప్పాలి. ‘బాహుబలి ది బిగినింగ్’ ‘బాహుబలి2’ ‘సాహో’ వంటి చిత్రాలతో ప్రభాస్ అక్కడ సూపర్ స్టార్ గా ఎదిగాడు.
దాంతో ‘రాధే శ్యామ్’ పై అక్కడ భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ ‘రాధే శ్యామ్’ ను అక్కడ భారీగా 1300 వందల స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. ఇక బిజినెస్ కూడా అక్కడ భారీగానే జరిగిందని తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘రాధే శ్యామ్’ కు అక్కడ రూ.76 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. అంటే ఫుల్ రన్లో ఈ చిత్రం అక్కడ రూ.80 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది.
‘సాహో’ ఫుల్ రన్లో అక్కడ రూ.125 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. కానీ అప్పుడు సాహో సోలో రిలీజ్ ను దక్కించుకుంది. ఇప్పుడైతే ‘ఆర్.ఆర్.ఆర్’ పోటీగా ఉంది. ఈ క్రమంలో ‘రాధే శ్యామ్’ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి..!