దక్షిణాది ఇండస్ట్రీలో తెలుగు తమిళ భాషలలో నటుడిగా దర్శకుడిగా కొరియోగ్రాఫర్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో రాఘవ లారెన్స్ ఒకరు సినిమాలలో నటిస్తూనే మరోవైపు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మరికొన్ని సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి లారెన్స్ ట్రస్ట్ ఏర్పాటు చేసి తన ట్రస్టు ద్వారా ఎంతో మందికి ఎన్నో విధాలుగా సేవ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇకపోతే తాజాగా ఈయన జిగర్ తండా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది అయితే ఈ సినిమా విజయవంతం కావడంతో చెన్నైలో సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మరో అద్భుతమైన అవకాశాన్ని అందరికీ కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లారెన్స్ మాట్లాడుతూ..
తన ప్రతి సినిమా విడుదలైన తర్వాత అభిమానులకు ఏదో ఒకటి చేయాలని నేను కోరుకుంటాను అందుకే ఈసారి తన అమ్మ పేరు మీద కన్మణి కళ్యాణ మండపాన్ని త్వరలోనే నిర్మించబోతున్నట్లు ప్రకటించాడు. అయితే ఇలా తన తల్లి పేరు మీదట ఈయన కళ్యాణ మండపం నిర్మించడానికి కారణం కూడా తెలియజేశారు. తన అభిమాని ఒకరు తనకు పెళ్లి పత్రిక ఇస్తూ తన పెళ్లి ఇంట్లోనే జరుగుతుందని ఎలాంటి వసతులు లేవని తెలిపారట. ఇక కళ్యాణమండపంలో చేసుకునే స్తోమత లేదని తెలిపారట.
ప్రతి ఒక్కరికి పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి వచ్చే మధురమైన అనుభూతి అలాంటి క్షణాన ఆ అభిమాని మొహంలో సంతోషం లేదని అందుకే అమ్మ పేరిట కళ్యాణమండపం నిర్మించబోతున్నానని లారెన్స్ తెలిపారు. తాను నిర్మించబోయే కళ్యాణ మండపంలో వంట పాత్రలతో సహా అన్ని వసతులు ఉంటాయని ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా అక్కడ పెళ్లి చేసుకోవచ్చు అంటూ (Raghava Lawrence) లారెన్స్ చెప్పడంతో అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.