ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) మైక్ పట్టుకుంటే చుట్టూ ప్రపంచాన్ని మరచిపోతారు అంటారు. ప్రపంచాన్నే కాదు తాను ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను అనేది కూడా మరచిపోతారు అనిపిస్తుంటుంది ఆయన ప్రసంగాలు చూస్తుంటే. మొన్నీమధ్యే వరుసగా ప్రసంగాల వివాదాలను ఎదుర్కొన్న రాజేంద్రప్రసాద్ మరోసారి వివాదస్పద ప్రసంగం చేశారు. ఈసారి బూతులు లేవు, ఇబ్బందికర పదాలు లేవు కానీ.. అప్రస్తుతాలు, లేనిపోని అంశాలు చాలానే ఉన్నాయి. దీంతో మరోసారి ఆయన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనేలా ఉంది.
రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ప్రసంగంలో తప్పులు, అప్రస్తుత అంశాలు, అధిక ప్రసంగాలు చాలానే ఉంటూ ఉన్నాయి. సీనియర్ నటుడు అవ్వడం, వయసులో పెద్దవాడు అవ్వడం, అందరితో చాలా ఏళ్లుగా ఉన్న చనువు లాంటి వాటి వల్ల నటులు పెద్దగా పట్టించుకోరు. అభిమానులు, ప్రేక్షకులకు కూడా ఇప్పుడిప్పుడే ఆయన అతి ప్రసంగాలు అలవాటు అవుతున్నాయి. అయితే తానా సభల్లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ పరమైన చర్చలకు కూడా దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది. దానికి కారణం ఆయన మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహా రావు పేరును, అప్పటి పరిస్థితుల్ని ప్రస్తావించడమే.
రాజేంద్ర ప్రసాద్ తన గొప్పతనం గురించి చెబుతూ.. పీవీ నరసింహా రావు పేరు ప్రస్తావించారు. ఆయన కేసులు, సూట్ కేసుల్లో ఉన్నప్పుడు తన సినిమాలు చూసే సాంత్వన పొందేవారు అని అన్నారు రాజేంద్ర ప్రసాద్. ఆ తర్వాత సత్య సాయిబాబా జుట్టు మీద జోకు వేశారాయన. దీంతో ఇటు రాజకీయ పరమైన చర్చ, అటు సత్యసాయి భక్తులను ఇప్పుడు ఆయన టచ్ చేసినట్లు అయింది. మరి ఈ మాటలు ఎంతవరకు వెళ్తాయో చూడాలి.
రాజేంద్రప్రసాద్ రీసెంట్ నోరు జారుడు వరుస చూస్తే.. మొన్నీ మధ్య ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో ఆలీని, రోజా లాంటి వారిని ఇబ్బందికరంగా పిలిచారు. అంతకుముందు ‘రాబిన్ హుడ్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ని సంబోధించిన తీరూ ఇబ్బందికరమే. ఇలా ఏదో ఒకటి అంటూ వార్తల్లో నిలుస్తున్నారు రాజేంద్ర ప్రసాద్.