ఏంటీ.. రజనీకాంత్ (Rajinikanth) మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఆ మధ్య మళ్లీ రాజకీయం అనే మాట ఎత్తను అన్నట్లుగా గుర్తు అని అంటారా. అవును మీరు చెప్పింది నిజమే.. రజనీకాంత్ నిజ జీవితంలో రాజకీయాల్లోకి రావడం లేదు. అయితే సినిమా కోపం పొలిటిషియన్ అవ్వబోతున్నాడు. దీనికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దానికి కారణం సీనియర్ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) . తలైవా రజనీకాంత్ – మణిరత్నం కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.
Rajinikanth, Mani Ratnam
సుమారు 30 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలవబోతున్నారు. మూడు దశాబ్దాల క్రితం ‘దళపతి’ (Thalapathi) అంటూ ఇద్దరూ కలసి వచ్చారు. ఆ సినిమా సృష్టించిన బీభత్సం ఎలాంటిదో మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత వస్తున్నారు కదా.. ఎలాంటి కథతో వస్తారు అని అనుకుంటుంటే.. పక్కా పొలిటికల్ డ్రామాతో వస్తారు అని తెలుస్తోంది. స్టార్లకంటే కథకే ప్రాధాన్యం ఇచ్చే దర్శకుడిగా మణిరత్నానికి పేరు. ఇప్పుడు రజనీ విషయంలో కూడా అదే చేశారు అని అంటున్నారు.
రజనీ సినిమా ఓకే అయింది కాబట్టి ఈ కథ రాయలేదని.. కథ అయ్యాక ఆ పాత్రకు రజనీ అయితే బాగుంటారు అని ఓకే చేశారు అని చెబుతున్నారు. ఈ మేరకు ఇటీవల రజనీకాంత్, మణిరత్నం మధ్య చర్చలు జరిగాయని, పొలిటికల్ డ్రామాగా సిద్ధం చేసిన కథ రజనీకి బాగా నచ్చింది అని చెబుతున్నారు. అంతేకాదు ఈ కథ నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాసుకున్నదని చెబుతున్నారు. అయితే ఎవరి నిజ జీవితం అనేది తెలియాల్సి ఉంది.
త్వరలోనే ఈ మొత్తం విషయాలకు క్లారిటీ ఇచ్చేస్తారు అని చెబుతున్నారు. ఇక రజనీకాంత్ ప్రస్తుతం ‘కూలీ’ (Coolie) సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల అనారోగ్యం వల్ల గ్యాప్ తీసుకున్న ఆయన త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తారట. ఆ తర్వాత ‘జైలర్ 2’ (Jailer) సినిమా ఉంటుందట. ఆ తర్వాతనే మణిరత్నం సినిమా ఉంటుంది అంటున్నారు. ఇక రజనీ నటించిన లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్’ (Vettaiyan) ఈనెల 10న విడుదలవుతోంది.