నటనలో తండ్రి వారసత్వాన్ని తీసుకున్న రామ్‌చరణ్ (Ram Charan) .. మంచి మనసు, దానగుణంలోనూ వారసుడు అనిపించుకుంటున్నాడు. ఇప్పటకే తన దగ్గరకు వచ్చి కష్టం చెప్పుకున్న వాళ్లకు తగు సాయం చేస్తున్న రామ్‌చరణ్.. తాజాగా ఓ చిన్నారికి ప్రాణం పోశారట. దీనికి సంబంధించి.. యువ నిర్మాత, మాజీ పీఆర్‌వో ఒకరు సోషల్ మీడియాలో తెలిపారు. దీంతో ‘మెగా’ మంచి మనసు మరోసారి నిరూపితమైంది అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు నాడే ఒక ఫోటో జర్నలిస్టు కుటుంబంలో మహాలక్ష్మి లాంటి ఓ ఆడబిడ్డ జన్మించింది.
Ram Charan
కానీ ఆ పాపకి హార్ట్‌లో హెల్త్ ఇష్యూ ఉందని తెలిసింది. పల్మనరీ హైపర్ టెన్షన్ అనే సమస్యతో ఆ చిన్నారి బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. పాప ప్రాణం మీదకు రిస్క్ ఉందని కూడా వైద్యులు చెప్పారు. దీంతో చికిత్స కోసం ఆ పాపని అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే చికిత్సకి లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పారట. కానీ సదరు జర్నలిస్టుకి అంత మొత్తం చికిత్సకు వెచ్చించే స్తోమత లేదు.
దీంతో తెలిసినవారి ద్వారా విషయంరామ్ చరణ్ దృష్టికి వెళ్లింది. పాప ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న చరణ్ ఆ చిన్నారికి చికిత్సను అందించే బాధ్యతను తీసుకున్నారు. ఆగస్టు 24న ఆ పాప ఆసుపత్రిలో జాయిన్ చేసినప్పటి నుండి డిశ్చార్జ్ వరకు ఆయన పర్యవేక్షించారు. పాపకు అవసరమైన బ్లడ్, ప్లేట్లెట్స్‌ను చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌ను తెప్పించారు.
అక్టోబర్ 16న ఆ చిన్నారి పూర్తిగా కోలుకుంది. దీంతో ఆ జర్నలిస్ట్ కుటుంబంలో తిరిగి సంతోషం వెల్లివిరిసింది. చరణ్ కారణంగానే తమ బిడ్డ తిరిగి తమకు దక్కింది అని ఆ కుటుంబం ఆనందంతో చెబుతోంది. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్.. ‘చెర్రీ సూపర్’ అంటూ పొగిడేస్తున్నారు. మొన్నీమధ్యే ఓ సీనియర్ జర్నలిస్టు వైద్యం కోసం చిరంజీవి కూడా ఇలానే సహాయం చేసిన విషయం తెలిసిందే.