సినిమాల్ని శుక్రవారం మాత్రమే రిలీజ్ చేయాలనే రూల్ లాంటిది ఏమీ లేకపోయినప్పటికీ.. గత కొన్ని దశాబ్ధాలుగా అది ఆనవాయితీగా కొనసాగుతుంది. ఎప్పుడైనా ఏదైనా పండగ సందర్భాలను మినహాయిస్తే 99% సినిమాలన్నీ శుక్రవారమే విడుదలయ్యాయి. అందువల్ల సగటు సినిమా అభిమాని కూడా శుక్రవారం “సినిమా డే” అని మైండ్ లో ఫిక్స్ అయిపోయాడు. దాంతో ఈమధ్య గురువారం సినిమాలు రిలీజ్ అవుతుంటే “ఇవాళ శుక్రవారమా” అని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. క్రిందటివారం నాని నటించిన “మిడిల్ క్లాస్ అబ్బాయి” గురువారం విడుదలైంది. ఈవారమేమో అల్లు శిరీష్ కథానాయకుడిగా తెరకెకిన “ఒక్క క్షణం” గురువారం అనగా డిసెంబర్ 28న విడుదలవుతోంది.
ఉన్నట్లుండి ఈ గురువారం విడుదలలు అధికమవ్వడానికి కారణాలు లేకపోలేదు. నిజానికి.. శుక్రవారం విడుదల చేస్తే ఆరోజు సాయంత్రానికల్లా టాక్ ఏంటో తెలిసి శనివారం, ఆదివారం కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఒక బాగుంటే భారీ స్థాయిలో కలెక్షన్స్ ఉంటాయి లేదంటే సినిమా సంగతి అయిపోయినట్లే. కానీ.. ఇప్పుడు కొత్తగా అలవాటవుతున్న గురువారం విడుదల పుణ్యమా అని మొదటివారం షేర్ ఎక్కువ వస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ కలెక్షన్స్ బాగుంటున్నాయి. అందుకే ఏమాత్రం మల్టీప్లెక్స్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుంది అనిపించినా గురువారం రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలో ఈ గురువారం విడుదల కూడా ఆనవాయితీగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.