తెలుగు సినిమా పరిశ్రమలో సంక్రాంతి పండుగ అంటే బలమైన బాక్సాఫీస్ పోటీ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక 2025 సంక్రాంతి కూడా అదే స్టైల్ లో బాక్సాఫీస్ ఫైట్ రసవత్తరంగా మారింది. ఈసారి విడుదలైన మూడు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ పై హవా కొనసాగించాయి. గేమ్ చేంజర్(Game Changer), సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam), డాకు మహారాజ్ (Daaku Maharaaj) మూడు సినిమాలూ తమదైన రీతిలో 100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డులు సృష్టించాయి.
Sankranthiki Vasthunam
ముందుగా రామ్ చరణ్ (Ram Charan) – శంకర్ (Shankar) కాంబినేషన్ లో వచ్చిన గేమ్ చేంజర్ రెండవ రోజుకే 100 కోట్ల మార్క్ చేరింది. భారీ అంచనాలు, గ్రాండ్ రిలీజ్ ఈ చిత్రానికి ఓపెనింగ్స్ ను పెంచాయి. మొదటి రోజు నుంచే తక్కువ టాక్ వచ్చినా, రామ్ చరణ్ ఫ్యాన్స్, భారీ స్క్రీన్ కౌంట్ ఈ సినిమాను రెండో రోజుకే సెంటరీ మార్క్ దాటించింది. అయితే సినిమా బిజినెస్ ను బట్టి చూస్తే ఈ రికార్డ్ మొదటి రొజే రావాలి. కానీ సినిమాకు నెగిటివ్ టాక్ కారణంగా 100 కోట్ల అనంతరం మళ్ళీ లెక్క పెద్దగా పెరగడం లేదు.
వెంకటేశ్ (Venkatesh Daggubati) – అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో వచ్చిన ‘‘సంక్రాంతికి వస్తున్నాం’’ (Sankranthiki Vasthunam) మాత్రం మూడవ రోజుకే 100 కోట్ల క్లబ్ లో చేరింది. కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి బలమైన మద్దతు లభించింది. పాజిటివ్ టాక్ కారణంగా ఈ సినిమా మరింతగా వసూళ్లు సాధించింది. అలాగే మిగతా రెండు సినిమాలతో పోలిస్తే ఎక్కువ స్థాయిలో లాభాలు వెంకటేష్ సినిమాకే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన ‘‘డాకు మహారాజ్’’ నాలుగో రోజునే 100 కోట్ల క్లబ్ చేరింది. బాబీ (K. S. Ravindra) దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రారంభం నుంచే బాలయ్య మాస్ ఫాలోయింగ్ ను మరింతగా పెంచింది. నాలుగో రోజుకి ఈ సినిమా కలెక్షన్లు స్టడీగా ఉండటం గమనార్హం. ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు కేవలం 4 రోజుల్లో 100 కోట్ల క్లబ్ లో చేరడం టాలీవుడ్ మార్కెట్ స్థాయిని మరోసారి ప్రదర్శించింది. మూడు సినిమాలు కలిపి 500 కోట్ల వసూళ్లను అందుకుంటే టాలీవుడ్ పొంగల్ బిజినెస్ మరో రికార్డ్ క్రియేట్ చేసినట్లే. మరి ఆ దిశగా ట్రెండ్ సెట్టవుతుందో లేదో చూడాలి.