ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు చెప్పిన తేదీకి కాకుండా వాయిదా పడి మరో తేదీకి రిలీజ్ కావడం సాధారణంగా జరుగుతోంది. పుష్ప ది రూల్ (Puhspa 2) మూవీ ప్రమోషన్స్ మొదలైన తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా వాయిదా పడింది. ఆగష్టు 15 లాంటి బ్రహ్మాండమైన డేట్ ను ఈ సినిమా మిస్ చేసుకోగా డిసెంబర్ నెల 6వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అయితే గేమ్ ఛేంజర్ (Game changer) కూడా డిసెంబర్ లో విడుదలయ్యే ఛాన్స్ ఉందని ఇప్పటికే దిల్ రాజు (Dil Raju) వెల్లడించారు.
హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) నిర్మాత ఏఎం రత్నం (AM Rathnam) సైతం డిసెంబర్ నెలలో వీరమల్లు అంటూ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. డిసెంబర్ లో పుష్ప2 సినిమాకు పోటీగా హరిహర వీరమల్లు రిలీజ్ కానుందా అనే సందేహాలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి పవన్ (Pawan Kalyan) ఎపిసోడ్స్ మేజర్ పార్ట్ పూర్తైందని ఏఎం రత్నం అన్నారు.
మరో 20 నుంచి 25 రోజుల సమయం కేటాయిస్తే షూట్ మొత్తం అయిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ బిజీ షెడ్యూల్ కు అనుగుణంగా షూటింగ్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని ఏఎం రత్నం తెలిపారు. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసిందని అగ్రిమెంట్స్ ప్రకారం హరిహర వీరమల్లు అక్టోబర్ లో రిలీజ్ కావాలని అయితే ఇంకాస్త సమయం కావాలని వాళ్లను అడుగుతామని ఏఎం రత్నం పేర్కొన్నారు.
డిసెంబర్ చివరి నాటికి సినిమాను రిలీజ్ చేస్తామని ఆయన చెప్పారు. ఏఎం రత్నం చెప్పిన విషయాలను గమనిస్తే పుష్ప2, హరిహర వీరమల్లు పోటీ పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండు పాన్ ఇండియా సినిమాలు వారం లేదా రెండు వారాల గ్యాప్ లో థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. త్వరలో వీరమల్లు రిలీజ్ డేట్ గురించి పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది.