‘ఆదిత్య 369’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు- బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘భైరవ ద్వీపం’. 1994 వ సంవత్సరం ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు పలు విభాగాల్లో ఏకంగా 9 నంది అవార్డులను సొంతం చేసుకుంది ఈ చిత్రం.ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన రోజా హీరోయిన్ గా నటించగా బి. వెంకట్రామరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
రావి కొండలరావు అందించిన కథ, మాటలు, మాధవపెద్ది సురేష్ సంగీత దర్శకత్వం వహించిన పాటలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి. టెక్నికల్ గా అభివృద్ధి చెందని రోజుల్లో కూడా ఈ మూవీని విజువల్ వండర్ గా మలిచారు సింగీతం గారు. ఇప్పటి హీరోలు కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ప్రయత్నించారు కానీ సింగీతం వంటి దర్శకుడు లేకపోవడంతో హీరోలు ముందడుగు వేయలేకపోతున్నారు. ఇదిలా ఉండగా.. ‘భైరవద్వీపం’ సినిమా సెన్సార్ టైములో చిత్ర బృందానికి ఓ వింత అనుభవం ఎదురైందట.
అదేమంటే ఈ చిత్రానికి ఒక్క కట్ కూడా చేయకుండా సెన్సార్ కార్యక్రమాలు జరిగాయట. అయినప్పటికీ సెన్సార్ వాళ్ళు ఓ విషయమై చిత్ర బృందానికి వార్ణింగ్ ఇచ్చారట. ‘మా వరకు మీ చిత్రానికి అభ్యంతరం చెప్పడం లేదు. కానీ బాణాలకి గుర్రాలు పడిపోయిన షాట్స్ కొన్ని ఉన్నాయి. వన్య ప్రాణి సంరక్షణ సంఘం వాళ్ళు వాటికి అభ్యంతరం తెలపొచ్చు. అలా జరిగితే ఆ సన్నివేశాలను తొలగించమంటారు’ అంటూ వార్ణింగ్ ఇచ్చారట.
కానీ సినిమా విడుదలయ్యాక వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకపోవడం విశేషం. మనం ఇప్పుడు చూసే సినిమాలకి జంతువులకి, పశువులకి ఎటువంటి హాని కలుగలేదు అని స్టార్టింగ్ లో వేయడానికి ముఖ్య కారణం ఇదే..!