ప్రతి దర్శకుడిలో ఓ నటుడు ఉంటారు. కొంతమంది తమ నటనను ఆ సినిమాలో నటుల ముందు చూపిస్తే, మరికొందరు వెండితెర మీద ఆవిష్కరిస్తుంటారు. ఇప్పటివరకు ఇలాంటి వాళ్లను చాలామందిని చూశాం. ఈ కోవలోకి మరో యువ దర్శకుడు వస్తున్నారా అంటే.. టాలీవుడ్ వర్గాల నుండి వచ్చేశారు అనే సమాధానం వినిపిస్తోంది. ఆయన ఓ ప్రేమకథల స్పెషలిస్ట్ కావడం గమనార్హం. ‘నేను శైలజ’ (Nenu Sailaja), ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ (Vunnadhi Okate Zindagi), ‘చిత్రలహరి’ (Chitralahari) సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు కిషోర్ తిరుమల (Kishore Tirumala).
Mirai
నిజానికి ‘సెకండ్ హ్యాండ్’ సినిమాతో దర్శకుడిగా మారిన రచయిత ఆయన. అందులో ఆయన ఒక కీలక పాత్రలో నటించారు కూడా. అయితే ఆ తర్వాత హిట్ దర్శకుడిగా మారాక మళ్లీ ఆ ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఆయనలో నటుడిని తెర మీదకు యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తీసుకొస్తున్నారు. ‘సూర్య వర్సెస్ సూర్య’ (Surya vs Surya), ‘ఈగల్’ (Eagle) లాంటి సినిమాలు చేసిన డైరక్టర్ టర్న్‌డ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిరాయ్’ (Mirai).
తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్(Manchu Manoj) మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయనది నెగిటివ్ షేడ్స్ ఉన్న యాంటీ హీరో పాత్రనట. ఈ సినిమాలోనే (Mirai) కిషోర్ తిరుమల ఓ కీలక పాత్రలో నటిస్తున్నారట. త్వరలోనే ఈ అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెబుతున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రలహరి’ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌గా చేశారు. ఆ సినిమా చేసేటప్పుడు కిషోర్ తిరుమలలోని నటుడిని చూసినట్లున్నారు. ఇప్పుడు అందుకే తన సినిమాలో ఒక పాత్రకు తీసుకున్నారు.
కామెడీ టచ్ ఈ క్యారెక్టర్‌లో కిషోర్ తిరుమల అదరగొడతారు అని టీమ్ చెబుతోంది. ఇక సినిమా సంగతి చూస్తే.. అశోక చక్రవర్తి రహస్యంగా దాచిన తొమ్మిది గ్రంథాల నేపథ్యంలో ‘మిరాయ్’ తెరకెక్కుతోంది. వాటిని సంరక్షించే యోధుడిగా తేజ సజ్జా కనిపించనున్నాడు. ఆ గ్రంథాలను సొంతం చేసుకోవాలనే కుటిల ప్రయత్నం చేసే బ్లాక్ స్వార్డ్ అనే పాత్రలో మంచు మనోజ్ కనిపిస్తాడట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాళీ, మరాఠీ, చైనీస్ భాషల్లో విడుదల వస్తుందట.